Marijuana Chocolates: గంజాయి చాక్లెట్ల స్మగ్లింగ్, బాలానగర్‌లో వ్యక్తి అరెస్ట్, నిందితుడు నుంచి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పాన్‌డబ్బా నడిపిస్తున్న జయంత్‌ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడి నుంచి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Marijuana chocolates seized in Telangana (Photo Credits: ANI)

Hyderabad, March 01: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో (Balanagar) గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాన్‌డబ్బా నడిపిస్తున్న జయంత్‌ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడి నుంచి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సనత్ నగర్, ఫతే నగర్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్లను (Marijuana Chocolates) విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు పక్కా సమాచారంతో ఆయా ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీ చేశారు. తనిఖీల్లో 228 గంజాయి చాక్లెట్లు లభించినట్లు ఎక్సైజ్ సీఐ జీవన్ కిరణ్ తెలిపారు. వీటిలో మొత్తం 1.2 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

జయంత్ ప్రధాన్ (41) అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన ఆకాష్ దాస్ అనే మరో వ్యక్తితో కలిసి అతడు ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

గత ఏడాది జూన్‌లో మేడ్‌చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో 1400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణంపై జరిగిన మరో దాడిలో 1320 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కర్ణాటకలో 43 వివాహ ఆహ్వాన కార్డులలో దాచుకున్న 5 కిలోల ఎఫెడ్రిన్ మందును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన ఎఫెడ్రిన్ మందును వివాహ ఆహ్వాన కార్డుల లోపల ఉంచిన 86 పర్సుల్లో దాచిపెట్టినట్లు గుర్తించారు.