IPL Auction 2025 Live

Mahashay Dharampal Gulati: ఎండీహెచ్ సంస్థల అధినేత మహాశయ్ ఇక లేరు, భారతీయ సుగంధద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన మసాలా సామ్రాజ్యాధినేత ప్రస్థానం స్పూర్థిదాయకం

ఆయన వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధిచెందుతూ కేవలం భారతదేశంలోనే కాకుండా యుకె, యూరప్, యుఎఇతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ భారతీయ సుగంధ ద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు.....

Dharampal Gulati Dies at 98 (Photo Credits: Twitter)

New Delhi, December 3: ఎండిహెచ్ మసాలా సంస్థల అధినేత, పద్మభూషణ్ గ్రహీత మహాశయ్ ధరంపాల్ గులాటి గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 98. గత కొంత కాలంగా అనారోగ్యంతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆయన, ఆరోగ్యం విషమించి ఈరోజు ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

దాదాజీ, మహాశయ్ జీ అని పిలువబడే ధరంపాల్ గులాటి చదివింది కేవలం 5వ తరగతి వరకు మాత్రమే కానీ, ఏళ్ల తరబడి ఆయన తన వ్యాపారంలో చేసిన కృషి, చూపిన అంకితభావం అన్నింటికీ మించి ఆయన నిజాయితీ ఆయనను ఒకస్థాయిలో నిలిపింది. ఒక సాధారణ జట్కా బండి నడిపేవాడిగా మొదలైన ఆయన ప్రయాణం, నెత్తిన పట్కా చుట్టుకుని బిలియనీర్ గా మారిన ఆయన ప్రస్థానం ఎందరికో స్పూర్థిదాయకం. ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులన్నింటికీ ఆయనే బ్రాండ్ అంబాసిడర్, అన్ని ఉత్పత్తులపై ఆయన ఫోటోనే ఒక బ్రాండ్ సింబల్ గా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది.

ధరంపాల్ గులాటి 1923 లో పాకిస్తాన్లోని సియాల్‌కోట్‌లో జన్మించారు. 1947లో దేశ విభజన తరువాత, ధరంపాల్ గులాటి భారతదేశానికి తరలివచ్చి అమృత్ సర్ లోని శరణార్థి శిబిరంలో బస చేశారు.

ఆ తర్వాత దిల్లీ వచ్చి, దిల్లీలోని కరోల్ బాగ్‌లో ప్రాంతంలో ఒక చిన్న మసాల దుకాణాన్ని ప్రారంభించాడు. కాలక్రమేనా దానినే 1959 నాటికి 'మహాశయన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ పేరుతో అధికారికంగా మొదలుపెట్టారు. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధిచెందుతూ  కేవలం భారతదేశంలోనే కాకుండా యుకె, యూరప్, యుఎఇతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ భారతీయ సుగంధ ద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు.

భారతదేశ వ్యాపార రంగంలో గులాటి చేసిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం 2019లో అయనను 'పద్మ' అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహాశయ్ గులాటి పద్మభూషన్ పురస్కారాన్ని అందుకున్నారు.