Daughter Kills Her Own Mother: ఒక్కర్తే కూతురు అని ప్రేమగా పెంచితే, ఆకర్శణ మోజులో పడి కన్నతల్లినే కడతేర్చింది. ఆందోళన కలిగిస్తున్న నేటి యువతీయువకుల మానసిక స్థితి
ఈనెల 19న కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తన వృత్తిలో భాగంగా వేరే ఊరికి వెళ్లాడు...
Hayathnagar, October 29: ఆ యువతి వయసు 19 ఏళ్లు, చూడటానికి లక్షణంగా, అమాయకంగా కనిపించే ఆ అమ్మాయి, ప్రేమ వ్యామోహంలో పడి కన్నతల్లినే చంపుకుందంటే నమ్ముతారా? ఈ ఘటన ఎక్కడో కాదు, హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే చోటుచేసుకుంది. తెలిసి చేసిందో, తెలియక చేసిందో ఆ యువతి చేసిన ఈ ఘోర తప్పిదంతో ఓ కుటుంబం కంటికి రెప్పలా కాపాడే ఓ చల్లని నీడను కోల్పోయినట్లయింది. ఆకర్శణ మోజులో పడిన ఆ యువతి నిజమైన ప్రేమకు చిహ్నంగా నిలిచే అమ్మ ప్రేమను కోల్పోయింది. కన్నతల్లిని చంపుకొని తనకు తానే అతిపెద్ద శిక్ష వేసుకుంది, తాను ఎంత పెద్ద తప్పు చేసిందో భవిష్యత్తులో ఆమెకే అర్థమవుతుంది.
వివరాల్లోకి వెళ్తే, పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తాడు. శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య రజిత (38), మరియు ఏకైక కూతురు కీర్తి రెడ్డి (Keethy Reddy) (19) కలిసి కొంతకాలం కిందట హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పరిధిలో ఉండే మునగనూరుకు వలస వచ్చారు. అక్కడే ఒక సొంత ఇల్లు కొనుక్కొని స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. కీర్తి రెడ్డి స్థానికంగా ఉండే బాల్ రెడ్డితో సన్నిహితంగా మెలగటం గమనించిన ఆమె తల్లి రజిత, కులాలు ఒకటే కావడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇరు కుటుంబాలు అందుకు అంగీకారం తెలిపాయి. అయితే కీర్తి అప్పటికే గర్భం దాల్చడంతో ఏమి తోచని స్థితిలో, తాను అన్నగా పిలిచే శశికుమార్ అనే వ్యక్తితో తన విషయాన్ని పంచుకుంది. కాగా, ఒక్కర్తే కూతురు, ఆమెను సొంతం చేసుకుంటే ఆస్తి తనకే వస్తుందని భావించిన శశికుమార్ ఆమె అవసరాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. ఆమెకు గర్భస్రావం చేయించాడు, అలాగే ఆ యువతిని భయపెట్టి లోభర్చుకొని ఆమెతో అక్రమంగా సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. తన మాటలతో కీర్తిని పూర్తిగా తన వశం చేసుకున్నాడు.
ఒకరితో పెళ్లి నిశ్చయించిన తర్వాత మరొకరితో సన్నిహితంగా మెలగటం గమనించిన కీర్తి తల్లి రజిత, తన కూతురును మందలించింది. శశికి దూరంగా ఉండమని హెచ్చరించింది. అయితే పూర్తిగా శశికుమార్ వ్యామోహంలో పడిన కీర్తికి కన్నతల్లే శత్రువులా కనిపించింది. తల్లిని చంపేస్తే శశితో తన బంధానికి ఎలాంటి అడ్డు ఉండదని భావించింది.
ఈనెల 19న కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి తన వృత్తిలో భాగంగా వేరే ఊరికి వెళ్లాడు. దీంతో ఇద్దరు పథకం ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న రజితను హత్య చేయాలనే ప్లాన్ చేశారు. కన్నతల్లి అనే కనికరం ఏమాత్రం లేకుండా కీర్తి తన సొంత అమ్మనే నిర్ధాక్షణ్యంగా, అత్యంత దారుణంగా ప్రియుడు శశి సహాయంతో మెడకు చున్నిబిగించి, ఊపిరాడకుండా చేసి చంపేసింది. అలా హత్య చేయడమే కాకుండా తల్లి శవాన్ని పక్కన పెట్టుకొని అదే ఇంట్లో 3 రోజులు గడిపారు.
దుర్వాసన వస్తుండటంతో అక్టోబర్ 22న శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి 60 కి.మీ దూరంలో రామన్నపేట రైలు పట్టాలపై పడేసి వచ్చారు. కీర్తి తన తల్లి ఫోన్ నుంచి కాబోయే మాకు ఫోన్ చేసి తన తల్లి రజిత లాగా మాట్లాడుతూ ఆరోగ్యం బాగా లేక నల్గొండ ఆసుపత్రికి వచ్చాను, కొన్నాళ్ల పాటు మా కూతురును మీ వద్దే ఉంచుకోండంటూ సూచించింది. ఆ విధంగా ఎవరికి అనుమానం రాకుండా వాళ్లింట్లో ఉండిపోయింది.
అక్టోబర్ 24న తండ్రి తిరిగి వచ్చి తాళం వేసిన ఇంటిని చూసి కీర్తికి ఫోన్ చేయడంతో తాను లేనని స్నేహితులతో కలిసి వైజాగ్ వెళ్లానని చెప్పింది, తల్లి గురించి మాత్రం ఏం చెప్పలేదు. ఆ మరుసటి రోజు ఇంటికి వచ్చినా, ఇల్లుకు తాళం అలాగే ఉంది, ఇటు తన భార్య రజిత నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసి కీర్తి కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది, అందుకు తన తండ్రే కారణం అని అతడిపై నెట్టే ప్రయత్నం చేసింది.
ఆ తర్వాత రోజు శ్రీనివాస్ రెడ్డి ఇల్లు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వాసన, చిందరవందరగా వస్తువులు పడిఉండటం చూసి ఏదో అనుమానం కలిగింది. కీర్తిని ఈ విషయంపై నిలదీయగా అసంబద్ధమైన మాటలు చెప్పింది. దీంతో గట్టిగా గద్దించి అడిగితే జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇది విన్న ఆ తండ్రి గుండె పగిలింది, మూర్ఖంగా తన భార్యను చంపేశారంటూ ఆన భోరున విలపించాడు. పోలీసులు కీర్తిని, శశికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా నిశ్చేష్టులయ్యారు.
మారుతున్న కాలంతో పాటు, పెరుగుతున్న విచ్చలవిడి సంస్కృతి, తాత్కాలిక వ్యామోహాల మోజులో పడి కన్నవారి పైనే కక్ష పెంచుకుంటున్న నేటి యువతీయువకుల మానసిక స్థితి ఆందోళన కలిగిస్తుంది. కన్నవారి ప్రేమ కన్నా గొప్పది ఏదీ ఉండదు అని నేటి యువత గుర్తించాలి. చిన్న వయసులో యువతీయువకులు ప్రేమ, వ్యామోహం లాంటి చెడు ఆలోచనల వైపు మళ్లకుండా ఈ సమాజం బాధ్యత తీసుకోవాలి.