Fowls Killed Due to DJ Music: మీ పెళ్లి డీజే సౌండ్ నా కోళ్ల చావుకొచ్చింది, డీజే సౌండ్‌తో 63 కోళ్లు చనిపోయాయంటూ పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితుడు, ఒడిషా బాలాసోర్‌లో ఘటన
కానీ ఒడిషాలో వింత ఘటన జరిగింది. తన కోళ్ల ఫామ్‌లోని కోళ్లు డీజే సౌండ్‌కు చనిపోయాయని ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. పెళ్లింట్లో పెట్టిన డీజే సౌండ్ వల్లనే 63 కోళ్లు చనిపోయాయని అతను ఆరోపించాడు. ఒడిషాలోని బాలాసోర్‌లో ఈ కేసు నమోదైంది.
Odisha November 24: కోడిని కోస్తే చచ్చిపోతుంది, లేకపోతే ఏదైనా రోగం వస్తే చనిపోతుంది. కానీ ఒడిషాలో వింత ఘటన జరిగింది. తన కోళ్ల ఫామ్‌లోని కోళ్లు డీజే సౌండ్‌కు చనిపోయాయని ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. పెళ్లింట్లో పెట్టిన డీజే సౌండ్ వల్లనే 63 కోళ్లు చనిపోయాయని అతను ఆరోపించాడు. ఒడిషాలోని బాలాసోర్‌లో ఈ కేసు నమోదైంది.
బాలాసోర్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు కోళ్లఫామ్ నడుపుతున్నాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు.. ఉద్యోగం లభించకపోవడంతో రూ.2 లక్షలు లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఆ ఫామ్ పక్కనే ఉన్న ఇంట్లో వివాహం జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో చెవులకు చిళ్లులు పడేలా డీజే సౌండ్ పెట్టారని, దీంతో కోళ్లు అల్లాడిపోయాయని, అటూ ఇటూ కొట్టుకుని కింద పడిపోయాని రంజిత్ చెప్పాడు. ఆ హోరెత్తించే శబ్దాలను తగ్గించుకోవాలని వేడుకున్నానని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని వెల్లడించాడు. దీంతో 63 కోళ్లు మృత్యువాతపడ్డాయని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
మరుసటి రోజు వెటర్నరీ డాక్టర్‌కు వాటిని చూపించానని, అవి గుండె పోటుతో కన్నుమూశాయని చెప్పినట్లు రంజిత్ చెప్పాడు. డీజే శబ్దాల వల్లనే తన కోళ్లు చనిపోయాయని డాక్టర్ కూడా స్పష్టం చేశాడన్నాడు. తనకు నష్టపరిహారం ఇవ్వాలని పెండ్లి జరిగిన ఇంటి యజమానికి అడిగానని, వారు స్పందించలేదన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రంజిత్ చెప్పాడు.
ఈ ఘటనలో తలలు పట్టుకున్న పోలీసులు…ఆ ఇంటి యజమానిని పిలిచి మాట్లాడారు. కేసు దాకా వెళ్లకుండా ఇరువురికి రాజీ చేసినట్లు పోలీసులు తెలిపారు.