Union Budget 2021: రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, రిపబ్లిక్ డే నాటి సంఘటనలు దురదృష్టకరమన్న రామ్‌నాథ్; కరోనాపై పోరులో ప్రపంచంలో భారత ఖ్యాతి పెరిగిందని కితాబు

ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది, అదే రాజ్యాంగం చట్టం మరియు పాలనను (లా అండ్ ఆర్డర్ ను) సమానంగా, కఠినంగా పాటించాలని మనకు బోధిస్తుంది....

President Ram Nath Kovind. (Photo Credits: ANI | Twitter)

New Delhi, January 29: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను హైలైట్ చేసిన రాష్ట్రపతి, కరోనాపై భారత్ చేసిన పోరాటం స్పూర్థిదాయకం అని కొనియాడారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనలు బాధ కలిగించాయని రాష్ట్రపతి తెలిపారు, జాతీయ జెండాకు అవమానం జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. భారత్ మరియు చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, గాల్వన్ లోయలో అమరవీరులైన సైనికులు, కరోనా వైరస్, దేశ ఆర్థిక వ్యవస్థ, వందే భారత్ మిషన్, ప్రతి ఇంటికి మంచినీరు, వ్యవసాయ చట్టాలు ఇలా అనేక అంశాలపై రాష్ట్రపతి ప్రసంగించారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు: - -ఒక మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చాలా మంది పౌరులను కోల్పోయాము. అయినప్పటికీ భారత ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది పౌరుల ప్రాణాలు కాపాడటం నాకు సంతృప్తిగా ఉంది. నేడు కరోనా కేసుల సంఖ్య కూడా వేగంగా తగ్గుతోంది మరియు కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

-కరోనా యొక్క ఈ కాలంలో, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడటానికి చేసిన ప్రయత్నాల మధ్య కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభించింది. ఈ కష్ట సమయంలో కూడా, ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా భారత్ ఉద్భవించింది. దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి గ్యాస్ కనెక్టివిటీ కూడా వేగంగా జరుగుతోంది.

గణతంత్ర దినోత్సవం లాంటి పవిత్రమైన రోజున జాతీయ జెండాకు అవమానం జరగటం చాలా దురదృష్టకరం. ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది, అదే రాజ్యాంగం చట్టం మరియు పాలనను (లా అండ్ ఆర్డర్ ను) సమానంగా, కఠినంగా పాటించాలని మనకు బోధిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, దేశంలోని రైతాంగానికి పాత విధానంలో ఉన్న హక్కులు మరియు ప్రయోజనాలలో ఎలాంటి తగ్గింపులు చేయలేదని నా ప్రభుత్వం స్పష్టం చేయాలనుకుంటుంది. అంతేకాకుండా, ఈ వ్యవసాయ సంస్కరణల ద్వారా ప్రభుత్వం రైతులకు మరిన్ని హక్కులను కల్పించింది.

-2020 జూన్‌లో, మా సైనికుల్లో 20 మంది మాతృభూమిని రక్షించడానికి గాల్వన్ లోయలో తమ అత్యున్నత త్యాగం చేశారు. ఈ అమరవీరులకు ప్రతి దేశస్థుడు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. నా ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉంది మరియు అప్రమత్తంగా ఉంది.

-చంద్రయాన్ -3, గగన్ యాన్, మరియు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం వంటి ముఖ్యమైన మిషన్లలో ఇస్రో శాస్త్రవేత్తలు అద్బుతంగా పనిచేస్తున్నారని మేము గర్విస్తున్నాము. దేశంలోని మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన భారీ నీటి రియాక్టర్ కొన్ని నెలల క్రితం కాక్రాపర్ వద్ద విజయవంతంగా పరీక్షించబడింది.

-ఇండియా దేశీయ అవసరాలను తీర్చడమే కాకా, 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను సరఫరా చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ లభ్యతను చేకూర్చడానికి భారతదేశం కట్టుబడి ఉంది.

కష్టకాలంలో విదేశాల్లోని భారతీయులకు స్వదేశాలకు రప్పించే మరియు విదేశీయులను తమ దేశాలకు తరలించే వందే భారత్ మిషన్ గొప్ప ప్రశంసలు అందుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి దాదాపు 50 లక్షల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చింది, అదేవిధంగా లక్షకు పైగా విదేశీ పౌరులు తమ దేశాలకు పంపబడ్డారు.

-నక్సల్స్ హింసాత్మక ఘటనలలో భారీగా తగ్గాయి మరియు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కూడా తగ్గిపోయాయి. నా ప్రభుత్వ అభివృద్ధి విధానానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు. కొద్ది వారాల క్రితం, స్వాతంత్ర్యం తరువాత మొదటిసారి, జమ్మూ కాశ్మీర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి.

-బ్రూ శరణార్థుల పునరావాస చర్యలు శాంతి మరియు సామరస్యంతో పూర్తవుతోంది. అదేవిధంగా, చారిత్రాత్మక బోడో శాంతి ఒప్పందం కూడా విజయవంతంగా అమలు చేయబడింది. ఒప్పందం తరువాత, ఈసారి బోడో టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

-నా ప్రభుత్వం 'జల్ జీవన్ మిషన్' ప్రతిష్టాత్మక ప్రణాళికపై పనిచేస్తోంది. దీని కింద, 'ప్రతి ఇంటికి నీరు' పంపిణీ చేయడంతో పాటు, నీటి సంరక్షణ కూడా వేగంగా జరుగుతోంది. ఈ ప్రచారం కింద ఇప్పటివరకు 3 కోట్ల కుటుంబాలు పైపు నీటి సరఫరాకు అనుసంధానించబడ్డాయి.

-ఇండియా ఈ ఏడాది ఎనిమిదవసారి తాత్కాలిక సభ్యునిగా ఐరాస భద్రతా మండలిలో ప్రవేశించి చారిత్రక గ్లోబల్ మద్దతు పొంందింది. 2021 సంవత్సరానికి బ్రిక్స్‌లో భారతదేశం అధ్యక్ష పదవిని చేపట్టింది.