Nirbhaya Case: నిర్భయ దోషుల ఖేల్ ఖతం, చివరి దోషి పవన్ గుప్తా క్షమాభిక్షను కూడా తిరస్కరించిన రాష్ట్రపతి, దోషులకు మూసుకుపోయిన అన్ని దారులు, ఇదే నెలలో ఉరితీసే అవకాశం
తాజాగా పవన్ గుప్తా క్షమాభిక్ష కూడా రాష్ట్రపతి తిరస్కరించటంతో ఇక ఏ దోషికి కూడా ఎలాంటి న్యాయపరమైన అవకాశము లేనట్లే....
New Delhi, March 4: 2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో (Nirbhaya Convicts) ఒకడైన పవన్ కుమార్ గుప్తా (Pawan Gupta) పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) బుధవారం తిరస్కరించారు. ఈ నలుగురికి నిన్న (మార్చి 03) నే ఉరితీయాల్సింది. అయితే పవన్ గుప్తా మార్చి 02న రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవడంతో దిల్లీ కోర్ట్ మరోసారి ఉరి అమలుపై స్టే విధించాల్సి వచ్చింది. ఈ కేసులోని దోషులు ఒక్కొక్కరు విడివిడిగా చిట్టచివరి సమయంలో తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఉండటం, వీరి ఉరితీత వాయిదా పడుతూ రావటం ఇలా ఇప్పటివరకు మూడు సార్లు జరిగింది. ఈ విధంగా ఈ నలుగురు దోషులు తమ ఆయిష్షును మరికొన్ని రోజులు పొడగించుకుంటూ వచ్చారు.
అయితే ఎట్టకేలకు ఈ కేసులో మొత్తం నలుగురు దోషులు వారికున్న అవకాశాలను వినియోగించుకోవడం ఇప్పుడు పూర్తైంది. తాజాగా పవన్ గుప్తా క్షమాభిక్ష కూడా రాష్ట్రపతి తిరస్కరించటంతో ఇక ఏ దోషికి కూడా ఎలాంటి న్యాయపరమైన అవకాశము లేనట్లే.
ఇక ఇప్పుడు నిబంధనల ప్రకారం, తాను పెట్టుకున్న క్షమాభిక్ష తిరస్కరణకు గురైందని దోషికి జైలు అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని జైలు అధికారులు మళ్లీ దిల్లీ కోర్టుకు తెలియజేసి, కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాల్సిందిగా కోరుతారు. క్షమాభిక్ష రద్దు కాబడిన దోషికి డెత్ వారెంట్ జారీచేయడానికి కూడా 14 రోజుల గడువు ఉంటుంది.
ఇవన్నీ చూసుకొని దిల్లీ కోర్ట్ మరోసారి డెత్ వారెంట్ జారీ చేయనుంది. అంచనా ప్రకారం ఈ మార్చి చివరి వారం లోపే దోషులకు చివరి సారిగా డెత్ వారెంట్ జారీ చేయవచ్చు. ఇప్పుడైతే దోషులెవ్వరికీ కూడా ఎలాంటి అవకాశం లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి. మరి ఈ సారైనా ఉరి అమలవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లోతెలిసిపోతుంది.