Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో బీజేపీ, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధి కోసం విపక్షాలతో రాజ్‌నాథ్ సింగ్ మంతనాలు, మమతా బెనర్జీ సహా పలువురికి ఫోన్లు, ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిపై ఇంకా రాని స్పష్టత
ఈ మేరకు బుధవారం పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మధ్యాహ్నం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో (Kharge) ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్, సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee), అఖిలేష్ యాదవ్ (Akhiesh Yadav)లతో ఫోన్ లో విడివిడిగా మాట్లాడారు.
New Delhi, June 16: రాష్ట్రప్రతి ఎన్నికను (Presidential elections ) ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ (BJP)ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే ఆధ్వర్యంలో బలపర్చే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు.
మధ్యాహ్నం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో (Kharge) ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్, సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee), అఖిలేష్ యాదవ్ (Akhiesh Yadav)లతో ఫోన్ లో విడివిడిగా మాట్లాడారు. మమతా బెనర్జీతో పాటు పలువురి నేతలతో రాజ్ నాథ్ ఫోన్ మాట్లాడిన సమయంలో వారి నుంచి ఎలాంటి సానుకూలత రాలేదని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తాము ఎన్డీయే బలపర్చే అభ్యర్థికి మద్దతు ఇవ్వలేమని మమత బెనర్జీ స్పష్టం చేసినట్లు కథనాలు వచ్చాయి. మిగిలిన ప్రధాన ప్రతిపక్ష నేతల నుంచి కూడా అదే రీతిలో సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు తక్కువనే చర్చ జాతీయ రాజకీయాల్లో సాగుతుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకమైన విపక్షాలన్నీ ఒక పేరు ప్రకటించేందుకు జోరుగా చర్చలు జరుపుతున్నాయి. బుధవారం సాయంత్రం తొలి దశ భేటీ జరిగింది. ఈ భేటీకి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్ (TRS), వైసీపీకి (YCP) ఆహ్వానం ఉన్నప్పటికీ ఆ పార్టీల నుంచి ఎవరూ పాల్గొనలేదు.
ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగాలని శరద్ పవార్ ను (Sharad Pawar) ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససేమీరా అన్నారు. తాను పోటీ చేయలేనని, క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం.
శరద్ పవార్ పోటీకి విముఖత చూపడంతో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ (Gopala Krishna Gandhi) పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఈనెల 21 మరోసారి భేటీ కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. 21న ఫలితాలు వెలువడనున్నాయి.