Rail Roko Andolan: రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం, మరింత తీవ్రరూపం దాల్చిన రైతుల ఉద్యమం
లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి.
Lakhimpur, Oct 18: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రరూపం (Rail Roko Andolan) దాల్చింది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం (Train Services Disrupted at 30 Places) ఏర్పడింది.
ఉత్తర రైల్వే జోన్‌లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్‌పీఓ సోమవారం తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది.