RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యధాతథంగా ఉంచిన ఆర్బీఐ, ద్రవ్య విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును మార్చకుండా ఉండటానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు....
Mumbai, February 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును మార్చకుండా ఉండటానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ " ఫిబ్రవరి 3, 4 మరియు 5 తేదీలలో సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ, ప్రస్తుతం అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక వ్యవస్థలు మరియు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక పరిణామాలపై సమీక్షించింది. అనంతరం పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మారకుండా ఉండటానికి కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది" అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
COVID-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, అలాగే ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేలా ప్రస్తుత మరియు మరుసటి ఆర్థిక సంవత్సరానికి మెరుగైన వృద్ధిని పునరుద్ధరించడానికి అవసరమైనంతవరకు ద్రవ్య విధానం యొక్క వైఖరిని యధాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాము. ద్రవ్యోల్బణం గాడిలో పడుతోంది, ఆర్థిక వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు వెళుతుందని దాస్ తెలిపారు.
ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 గా ఉండనున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది.
RBI maintains status quo on Repo & reverse repo rate:
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ మరియు బ్యాంక్ రేటు ప్రస్తుతం ఉన్నట్లుగానే 4.25 శాతంగా ఉంటుంది, రివర్స్ రెపో రేటు కూడా మారదు, 3.35 శాతంగా ఉంటుందని ఆర్బిఐ గవర్నర్ తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ 2021-22 సమర్పించిన తరువాత ఆర్‌బిఐ సమీక్షించిన మొదటి ద్రవ్య విధానం ఇది. శక్తికాంత దాస్ ఈరోజు మరోసారి 12 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.
ఇదిలా ఉంటే, ఆర్బీఐ ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 11:45 సమయానికి సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 50,906 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,964 వద్ద కొనసాగుతున్నాయి.