IPL Auction 2025 Live

Delhi Violence: దిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్ణణ, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి, డీసీపీకి గాయాలు, శాంతిభద్రతలను కాపాడాలని కేంద్రానికి సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఇరు వర్గాల మధ్య సవాళ్లు - ప్రతిసవాళ్లతో వారి ఆందోళనలు ఘర్షణలకు దారితీశాయి. సోమవారం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలు ఇండ్లు, దుకాణాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు......

Clashes in Maujpur | (Photo Credits: ANI)

New Delhi, February 24:  ఈశాన్య దిల్లీలోని (North East Delhi)  గోకుల్‌పురి ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు సోమవారం హద్దులు మీరాయి. సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో (Violence) దిల్లీ పోలీసుల హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఇరుపక్షాలు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ (Head constable Ratan Lal )

తలకు ఒక రాయి వచ్చి బలంగా తాకింది. దీంతో రతన్ లాల్ అక్కడికక్కడే కుప్పకులారు. ఈ రాళ్ల దాడిలో డిప్యూటీ కమిషనర్ (DCP) స్థాయి కలిగిన మరో పోలీసు అధికారి అమిత్ శర్మకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన సమీపంలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు.

సిఎఎ వ్యతిరేక నిరసనకారులు షాహీన్ బాగ్ తరహాలో అంతేస్థాయి నిరసనలను నిర్వహించాలని జాఫ్రాబాద్‌ ప్రాంతంలో కూడా నిర్ణయించినప్పటి నుంచి, అది సిఎఎ మద్ధతుదారుల్లో అగ్గిని రాజేసింది. దీంతో ఆదివారం నుంచి ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్, గోకుల్‌పురి, మౌజ్ పూర్, భజన్ పుర తదితర ప్రాంతాలు సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఇరు వర్గాల మధ్య సవాళ్లు - ప్రతిసవాళ్లతో వారి ఆందోళనలు ఘర్షణలకు దారితీశాయి. సోమవారం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలు ఇండ్లు, దుకాణాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజన్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జ్ చేశారు. సమస్యతామక ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులపై నిషేధాజ్ఞలు జారీచేశారు.

కాగా, ఈ పరిణామాలపై దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే వార్తలు రావడం తనను బాధిస్తున్నాయని తెలిపారు. తక్షణమే శాంతి, భద్రతలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరియు కేంద్ర హోంమంత్రికి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.