New Farm Laws: వ్యవసాయ బిల్లులపై కేంద్రానికి నోటీసులు, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఇప్పటికే ఆమోద ముద్ర పొందిన మూడు వ్యవసాయ బిల్లులు
ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్ధానం (Supreme Court) ఆదేశించింది.
New Delhi, Oct 12: గత నెల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ బిల్లులను (three new agricultural laws) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు (Supreme Court notice to Centre) జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్ధానం (Supreme Court) ఆదేశించింది. వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే (Chief Justice S A Bobde) నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కాగా పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టరూపం దాల్చాయి.
చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వాటిని అమలు కాకుండా చూడాలని సుప్రీం కోర్టు న్యాయవాది మనోహర్‌శర్మ, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఛత్తీస్‌గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. న్యాయవాది శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషన్‌లో సరైన కారణాలు చూపనందున విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదికి సూచించింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ దీనిపై బదులివ్వాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. నూతన వ్యవసాయ చట్టాలతో చత్తీస్‌గఢ్‌లోని స్ధానిక చట్టాలకు కాలం చెల్లుతుందని అంటూ నూతన చట్టాలను కొట్టివేయాలని పిటిషనర్ వైష్ణవ్ తరపు న్యాయవాది పీ పరమేశ్వరన్ సర్వోన్నత న్యాయస్ధానాలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశంపై దాఖలైన నాలుగు పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020) బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించింది. అనంతరం బిల్లులకు రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు. బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదించిన నాటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో పాటు రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.