Farm Bills Enacted as Law: మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర, నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు
Farmer harvesting wheat crop | File Image | (Photo Credits: PTI)

New Delhi, September 27: విపక్షాల వ్యతిరేకత మధ్య ఉభయ సభల్లో ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర (Farm Bills Enacted as Law) వేశారు. సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను (President Ram Nath Kovind) కలిసి అభ్యర్ధించారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను (new agriculture bill) ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి.

ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్‌ బంద్‌ చేపట్టాయి. హరియాణ, పంజాబ్‌, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు. ఈ బిల్లులతో రైతులను కార్పొరేట్‌ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థ కనుమరుగవుతుందని విపక్ష నేతలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతుల ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తాయని, దళారీ వ్యవస్థ దూరమై రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.

కొత్త చట్టంతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు పోతుంది, ఆ భయంతోనే విమర్శలు చేస్తున్నారు, బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) ప్రకటించింది.కాగా వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాలీదళ్‌ బయటకు రావడాన్ని విపక్షాలు స్వాగతించాయి. అకాలీదళ్‌ నిర్ణయాన్ని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమర్ధించారు. అకాలీదళ్‌ నేతలు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన హర్‌సిమ్రత్‌ బాదల్‌లు రైతుల పక్షాన గట్టిగా నిలబడి పోరు సాగించారని శరద్‌ పవార్‌ ప్రశంసించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిబద్ధతతో పోరాడారని పవార్‌ ట్వీట్‌ చేశారు.

విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం, బిల్లు ముసాయిదా ప్రతులను చించేసిన విపక్ష ఎంపీలు

ఇక రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటూ అకాలీదళ్‌ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన ప్రశంసిస్తోందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు. శివసేనతో పాటు, శిరోమణీ అకాలీదళ్‌ వైదొలగడంతో ఎన్డీయే విచ్ఛిన్నమైందని, తాము ఇరువురం లేని కూటమి ఎన్డీయే కానేకాదని స్పష్టం చేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నాయని గుర్తుచేశారు. అయితే తమ స్థానంలో వచ్చే కొత్త స్నేహితులు కూడా ఎంతకాలం ఉంటారో చెప్పలేమని రౌత్‌ వ్యాఖ్యానించారు

మరోవైపు రైతులను కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు ఇచ్చారు. రైతుల ఆర్థిక దయనీయ స్థితి దేశ ఆర్థిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుందని, దేశ విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని పంజాబ్‌లో పార్టీ కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బాదల్‌ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్‌ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు.

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి

పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో రైల్‌ రోకో ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గత మూడు రోజులు నుంచి రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్‌ రోకోలు నిర్వహిస్తున్నారు. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్‌సర్‌లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు.

చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్‌ సింగ్‌ పాంధేర్‌ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా శనివారం స్పీక్‌ అప్‌ ఫర్‌ ఫార్మర్స్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం రైతుల్ని అమాయకుల్ని చేసి దోపిడీ చేస్తోందని వారికి మద్దతుగా ప్రజలందరూ గళమెత్తాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించారని ఆరోపించారు.