Veterinary Doctor Rape- Murder: నగరం నిద్రపోతున్న వేళ అరణ్య రోదనే అయిన ఆమె ఆర్తనాదాలు, ఏమైపోయాయి నాలుగో సింహాలు? ఏం చేస్తుంది అధికార యంత్రాంగం, వేగంగా స్పందిస్తే మరోలా ఉండేదేమో!
రాత్రి 11 గంటలకే పోలీసులకు ఫిర్యాదు చేశాం, వారు అప్పుడే దర్యాప్తు ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.....
Hyderabad, November 29: ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ, త్వరలో పెళ్లి చేసుకొని ముందున్న ఉజ్వల భవిష్యత్తుపై ఆమె కన్న రంగుల కలలు ఒక్క కాళరాత్రితో అర్ధాంతరంగా కనుమరుగయిపోయాయి. ఆమె దివ్యమైన తేజస్సు గుర్తుపట్టలేని స్థితిలో రోడ్డు పక్కన మసిగా మారి అటు నుంచి అటే అనంతలోకాల్లో కలిసిపోయింది. మూగజీవాలకు ప్రాణంపోసే వృత్తిని ఎంచుకున్న డా. , చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఈ క్రూరమైన మనుషుల కంటే పశువులే ఎంతో మేలని తన వృత్తి పట్ల గర్వపడి ఉండవచ్చు. అలా అయినా తన ఆత్మకు శాంతి చేకూరి ఉండవచ్చు.
ఇక డా. (Vety Doctor) హత్య కేసుకు సంబంధించి ఇప్పుడిప్పుడే విషయాలు కొన్నికొన్నిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు ఈ కేసులో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక లారీ డ్రైవర్ మరియు ఒక క్లీనర్, అలాగే తెలంగాణ నుండి మరో ఇద్దరినీ కలిపి మొత్తం నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై విచారణ తర్వాత పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
జరిగిన విషాదాన్ని మరోసారి తలుచుకుంటే, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) సమీపంలో వెటర్నరీ హాస్పిటల్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) గా గెజిటెడ్ హోదాలో విధులు నిర్వహించే యువ డాక్టర్ చివరిసారిగా నవంబర్ 27, బుధవారం రాత్రి తొండుపల్లి టోల్ గేట్ (Tondupally Toll Plaza) వద్ద కనిపించింది.
అంతకుముందు ఆమె విధులు ముగించుకొని ఇంటికి తిరిగి ప్రయాణమవుతుండగా మార్గమధ్యంలో తను రెగ్యూలర్‌గా వెళ్లే బ్యూటీ కేర్ క్లినిక్‌కు వెళ్లింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, త్వరలో చేసుకోబోతుంది కాబట్టి అందుకు సంబంధించిన పనుల్లో భాగంగా గచ్చిబౌలిలో బ్యూటీ కేర్‌కు వెళ్తుండేది. అక్కడ్నించి క్యాబ్‌లో హైదరాబాద్ - బెంగళూరు నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద , తొండుపల్లి టోల్ ప్లాజాకు కొంత దూరంలో సర్వీస్ రోడ్డుపై ఎక్కడైతే తన స్కూటీ పార్క్ చేసిందో అక్కడికి చేరుకుంది. అప్పుడు సుమారు రాత్రి 9:15 అవుతుంది.
బైక్ పంక్చర్ అయి ఉండటం, అమ్మాయి ఒంటరిగా కనిపించడంతో రోడ్డు పక్కన ఉన్న లారీ డ్రైవర్లు సహాయం చేస్తామని నమ్మించారు. అప్పటికే ఆమె భయపడింది కూడా తన చెల్లికి రాత్రి 9:22 సమయంలో విషయాన్ని చెప్పింది, 9:30 వరకు ఫోన్‌లో మాట్లాడింది. చెల్లి కూడా ఉద్యోగస్తురాలు కావడంతో తన పని పూర్తయిన తర్వాత 9:44 సమయాని అక్కకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత అక్క కోసం 10:20 సమయాని టోల్ ప్లాజా వద్దకు చేరుకొని అక్కడంతా వెతికి కనిపించకపోవడంతో పేరేంట్స్‌కు ఫోన్ చేసింది. చీకటి పడుతున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బుధవారం రాత్రి 9:44 నుంచి యువతి నుంచి ఎలాంటి స్పందనలు లేవు. ఆమె ఫోన్ సిగ్నల్ కూడా ట్రేస్ కాలేదు. అయితే మరుసటి రోజు గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో, టోల్ ప్లాజా నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్ పల్లి బ్రిడ్జి కింద కాలిపోయిన స్థితిలో మనిషి మృతదేహం ఉందని సమాచారం అందటంతో పోలీసులు, వైద్య బృందం, ఘటనాస్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఆమె ఆనవాళ్లను తమ బిడ్డే అని నిర్ధారణ చేశారు.
అంటే రాత్రి ఎవరూ లేని సమయం చూసి, 9:44 సమయంలో ఆ యువతిని కిడ్నాప్ చేసి, డీసీఎంలో 25 కిలో మీటర్లు తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆమెపై అఘాయిత్యం చేసి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినపుడు జనసంచారం ఎక్కువగా ఉండని చటాన్ పల్లి కల్వర్టు కింద సుమారు అర్ధరాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ్నించి పరారయ్యారు. ఉదయం 5 గంటల సమయంలో స్థానికంగా పాలు అమ్మే వ్యక్తి అటుగా బైక్‌పై వెళ్తూ బ్రిడ్జి కింద మంటను గమనించాడు. అయితే చలిమంట పెట్టుకొని ఉంటారని భావించి అక్కడ్నించి వెళ్లిపోయాడు. తిరిగి ఉదయం 7:30 సమయంలో వచ్చేటపుడు కూడా బ్రిడ్జి కింద అలాగే మంటలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా తెల్లవారుకావడంతో ఆ వెలుగులో ఆ మంటల్లోనే మనిషి చేయి పైకి చాచినట్లుగా స్పష్టంగా గమనించాడు. వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, హుటాహుటిన ఇంటికి వెళ్లి ఇంట్లోని ఫోన్ ద్వారా ఉదయం 8 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బృందంతో వచ్చేసరికి ఉదయం సుమారు 9:30 కావొచ్చింది. ఉదయం 10:30 సమయానికి అక్కడే పోస్ట్ మార్టం చేశారు. అయితే యువతి శరీరం చాలా సేపు మంటల్లో కాలుతూ ఉండంతో ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని నిర్ధారించడం కష్టమైంది. కానీ, అక్కడి పరిస్థితులు యువతికి చెందిన బట్టలు, చెప్పులు, ఐడీ కార్డు, మద్యం సీసాలు వేరువేరు ప్రదేశాల్లో ఉండటం చూసి ఆమెపై ఆ నరరూప రాక్షసులు తమ పైశాచికత్వం చూపించే ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనావేశారు.
యువతి స్కూటీ కూడా ఆమె మృతదేహానికి 11 కిమీ దూరంలో లభ్యమైంది. నెంబర్ ప్లేట్ కూడా తీసివేయబడి ఉంది. దీనిని బట్టి ఆ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్నవారే చాలా ప్లాన్‌డ్ గా మర్డర్ చేశారని అర్థమవుతుంది. ఆధారాలు దొరకకుండా దహనం చేయడాన్ని బట్టి చూస్తే నేరచరిత్ర ఉన్నవారి లాగే అర్థమవుతుంది. ఈ కేసులో ప్రధాన అనుమాతుడిగా భావిస్తున్న లారీ డ్రైవర్ మహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అయితే రాత్రి 11 గంటలకే పోలీసులకు ఫిర్యాదు చేశాం, వారు అప్పుడే దర్యాప్తు ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీసు స్టేషన్ కు అర్ధరాత్రి పరుగెత్తాల్సి వచ్చిందని అలా చాలా సమయం వృధా అయిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి సోదరి మొదట దగ్గర్లోని RGIA పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, అది మా పరిధిలోకి రాదని శంషాబాద్ వెళ్లమని సూచించారు. చివరకు అక్కడికీ వెళ్లి ఫిర్యాదు చేశాం. 'పోలీసులు ఇలా సమయం వృధా చేయనీయకుండా వ్యవహరించి ఉంటే, కనీసం నా అక్క బ్రతికైనా ఉండేది' అంటూ ఆమె సోదరి తీవ్ర ఆవేదన చెందింది. తమ బిడ్డపై జరిగిన దారుణం, ఏ కుటుంబానికి జరగకూడదని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)