JK Encounter: జమ్మూకశ్మీర్ ఆర్మీ, పోలీసులు జాయింట్ ఆపరేషన్, ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి వీర మరణం, మరో ముగ్గురు జవాన్లకు గాయాలు, కొనసాగుతున్న ఎన్ కౌంటర్
ఈ ఎన్‌కౌంటర్‌లో 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మరణించినట్లు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.
Srinagar, NOV 10: ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. (Army Officer Killed) జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మారుమూల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మరణించినట్లు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. మరో ముగ్గురు కమాండోలు గాయపడినట్లు పేర్కొంది. కిష్త్వార్‌లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో భాగమైన నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ ఎంతో ధైర్యంతో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైనట్లు వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వెల్లడించింది.
ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. కాగా, ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులైన నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కిష్త్వార్ అడవులలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.