UAPA Bill: దూకుడు మీదున్న మోడీ సర్కార్. రాజ్యసభలో 'ఉపా' బిల్లుకు ఆమోదం. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై ఉగ్రవాదులుగా ముద్ర పడనుంది.
ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఏకంగా ఉగ్రవాద ముద్ర వేసి, కఠిన శిక్షలు అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం....
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తమ 'భావజాలానికి' తగినట్లుగా అవసరమయ్యే కీలక బిల్లులన్నీ పార్లమెంటులో సునాయాసంగా పాస్ చేసేసుకుంటుంది. ఒక వైపు కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 35 ఎ రద్దు అంశంపై వడివడిగా అడుగులు వేస్తూనే మరోవైపు NIAకు విస్తృత అధికారాల బిల్లు, RTI బిల్లు, POCSO బిల్లు ఆఖరుకి మొన్నటికి మొన్న 'ట్రిపుల్ తలాక్' బిల్లును కూడా పాస్ చేసేసుకుని దూకుడు మీద ఉంది. తాజాగా UAPA Bill (Unlawful Activities (Prevention) Amendment Bill, 2019). బిల్లు సైతం రాజ్యసభ ఆమోదం పొందింది. 147:42 ఓట్ల తేడాతో ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గింది.
ఇందులో మిగతా బిల్లుల సంగతి మాట ఎలా ఉన్నా 'ట్రిపుల్ తలాక్' బిల్లు, UAPA బిల్లులు ఎంతో కీలకం. ప్రతిపక్షం తలచుకుంటే రాజ్యసభలో వీటిని నిలువరించగలిగే శక్తి ఉంది. వాస్తవానికి మోడీ సర్కార్ లోకసభలో ఎలాంటి బిల్లునైనా ఆమోదింపజేసుకునే బలం ఉన్నప్పటికీ, రాజ్యసభలో ప్రభుత్వానికి అంత బలం లేదు. ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నిస్తే ఏ బిల్లు కూడా రాజ్యసభ దాటి ఎక్కడికి వెళ్లదు. అయితే ఎప్పుటికప్పుడు ప్రభుత్వాన్ని బలంగా ఎండగట్టే విపక్షాలు, అసలుసిసలైన పార్లమెంటులో మాత్రం జాడ లేకుండాపోతున్నాయి.
సభకు రాకపోవడం, ఓటింగ్స్ లో పాల్గొనకపోవడంతో, వాకౌట్స్ చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి అవసరమయ్యే బిల్లులన్నింటినీ రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకోవడం సునాయాసమైపోతుంది. దీనంతటికి కారణం ప్రతిపక్షంలో ఐకమత్యం లేకపోవడం, వివిధ పార్టీల విపక్ష సభ్యులందరినీ ఒక్కతాటిపై తెచ్చే నాయకత్వం లేకపోవడం.
ఈ UAPA 2019 బిల్లు ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ఉగ్రవాద, అర్బన్ నక్సలైట్ల ముద్రపడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల తీసుకునే చర్యలు కఠినాతికఠినంగా ఉంటాయి.
రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ ఈ బిల్లుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మామూలు వ్యక్తులను సైతం ఉగ్రవాదులుగా చిత్రీకరించి, వారిని వేధింపులకు గురిచేసే అవకాశం కల్పించేలా ఉందని సందేహం వ్యక్తం చేశారు.
NIAకు విశేషాధికారాలను కల్పించటానికి, ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా పేర్కొనడం లేదా ఆ లిస్ట్ నుంచి తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుందని బిల్లులో పేర్కొనటం సమంజసం కాదని, ఇది మానవ హక్కులకు భంగం కల్పించటమే అవుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, కాంగ్రెస్ పార్టీ- యూపీఏ పక్షం ఉగ్రవాదానికి ఖచ్చితంగా వ్యతిరేకమే కానీ, ఇలాంటి లోపాలన్న బిల్లును తాము సమర్థించబోమని చిదంబరం పేర్కొన్నారు.
దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఇది తాము కొత్తగా చేసిన చట్టం కాదని, పాత చట్టానికి కొన్ని సవరణలు మాత్రమే చేశామని తెలిపారు. ఒక ఉగ్రవాద సంస్థను నిషేదిస్తే మరొకటి పుట్టుకొస్తుంది, ఇలా ఎన్ని సంస్థలను నిషేధించాలి? అందుకే వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తిస్తే తద్వార ఉగ్రవాదం తగ్గించవచ్చునని చెప్పారు. ఎలాంటి మానవ హక్కులకు భంగం కల్పించకుండా, ఒకరిని ఉగ్రవాదిగా గుర్తించటానికి 4 దశలలో సునిశిత పరిశీలనలు జరుగుతాయని షా పేర్కొన్నారు.
ఈ వాదనలు ఎలా ఉన్నా, మొత్తానికి రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రభుత్వ అధికారాలకు మరింత పదును పెరిగినట్లయింది. విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా ఈ బిల్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా అది చట్టవ్యతిరేక కార్యకలాపాల కిందికే వస్తుంది, కాబట్టి వారిపై ఉగ్రవాద చట్టాలను ప్రయోగించే అవకాశమైతే ఉంది.