IPL Auction 2025 Live

Delhi Burning: ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు, పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తం, అల్లర్లతో 13కు చేరిన మృతుల సంఖ్య, పాఠశాలలకు సెలవులు, పరీక్షలు వాయిదా, మీడియా ప్రసారాలపై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని షెడ్యూల్ ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు దిల్లీ నుంచి అమెరికా బయలుదేరే వరకు పోలీసులు సహనంతో ఉంటారు, అప్పటికీ ఆందోళనలు తగ్గకపోతే కఠినంగా వ్యవహరిస్తారని పలు నివేదికలు వెల్లడించాయి.....

Delhi Riots | (Photo Credits: PTI)

New Delhi, February 26:  దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా సిఎఎ వ్యతిరేక (Anti CAA) , అనుకూల (Pro-CAA) వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో (Violence) అట్టుడుకుతున్న ఈశాన్య దిల్లీ (Northeast Delhi) ప్రాంతంలో మంగళవారం సాయంత్ర నాటికి పరిస్థితులు మరింత దిగజారాయి. అల్లర్లలో చనిపోయిన మృతుల సంఖ్య 13కు చేరింది, గాయపడిన వారి సంఖ్య 150 దాటింది, 50కి పైగా పోలీసులూ గాయపడ్డారు.

మంగళవారం జరిగిన అల్లర్లలో ఆందోళనకారులు ఇండ్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. గుంపుగా ముందుకు ఎగబడుతూ వారి దారిలో కనిపించిన ప్రతీదానికి పెట్రోల్ బాంబులతో దాడుచేస్తూ తగలబెట్టారు. మంటలార్పడానికి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లను అల్లరిమూకలు ధ్వంసం చేశారు. పలువురు ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు.

అల్లరిమూకలు (Rioters)  తలకు హెల్మెట్లు పెట్టుకొని ముఖం కనిపించకుండా, దెబ్బలు తగలకుండా ఏర్పాట్లు చేసుకొని దాడులకు తెగబడటం కనిపించింది. చేతిల్లో కర్రలు, రాడ్లు, కొంతమంది చేతుల్లో కత్తులు, పిస్తోళ్లు కూడా ఉన్నట్లు తెలిసింది. తుపాకీతో కాల్చడం వల్ల హెడ్ కానిస్టేబుల్ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్లలో మరణించిన వారిలో కొంతమందికి బుల్లెట్ గాయాలు ఉన్నట్లు జీటీబీ హాస్పిటల్ వైద్యాధికారులు ధృవీకరించారు.

బయట వ్యక్తులు దిల్లీలో చొరబడి అల్లర్లు సృష్టిస్తున్నారనే సమాచారం అందడంతో దిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు 144 సెక్షన్, కర్ఫ్యూ లాంటి నిషేధాజ్ఞలు విధించినా, భాష్పవాయువు గోళాలు ప్రయోగించినా, లాఠీఛార్జ్ చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో రాత్రి ఈశాన్య దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 'కనిపిస్తే కాల్చివేత' (shoot-at-sight) ఆదేశాలు జారీచేయబడ్డాయి. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు అనౌన్స్ చేశారు. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. ఈ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని కొంతమంది సామాన్య ప్రజలు సైతం గుంపులో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఒక వ్యక్తి, నెలలు నిండని చంటి బిడ్డను ఎత్తుకొని అల్లరిమూకల మధ్య బిక్కుబిక్కుమంటూ నడిచిన దృశ్యం కలిచివేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని షెడ్యూల్ ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు దిల్లీ నుంచి అమెరికా బయలుదేరే వరకు పోలీసులు సహనంతో ఉంటారు, అప్పటికీ ఆందోళనలు తగ్గకపోతే కఠినంగా వ్యవహరిస్తారని పలు నివేదికలు వెల్లడించాయి.

దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇరువర్గాలు శాంతించండి, పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేయకండి, హింసవల్ల సాధించేది ఏమి ఉండదు అని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో సంప్రదిస్తూ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలకు బుధవారం సెలవులు ప్రకటించారు. ఈరోజు జరగాల్సి ఉన్న సీబీఎస్ఈ పదో తరగతి మరియు ప్లస్ టూ పరీక్షలను కూడా వాయిదా వేశారు.

ఇక దిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి మీడియా ప్రసారాలపై, వార్తలపై మరియు దృశ్యాలపై ఖచ్చితమైన జాగ్రత్త వహించాలంటూ కేంద్ర సమాచార శాఖ ఆంక్షలు విధించింది.