Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగులకు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్లను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణయం, ఎవరెవరికి దక్కుతాయంటే?
ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది
Mumbai, OCT 04: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది. శుక్రవారం వారంతపు ట్రేడింగ్ సెషన్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో జొమాటో షేర్లు రూ.275.20 వద్ద ముగిశాయి. దీంతో ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ మొత్తం విలువ రూ.330.17 కోట్లుగా మారింది. మొత్తం ఆప్షన్లలో 11,997,652 ఆప్షన్లు ‘ఈఎస్‌ఓపీ 2021’ ప్లాన్ కిందకు వస్తాయి. మరో 116 ఆప్షన్లు ‘ఈఎస్‌ఓపీ 2014’ కిందకు వస్తాయి. కంపెనీ వాటిని "ఫుడీ బే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్"గా పేర్కొంది.
ఈఎస్‌ఓపీలు (ESOP) అనేవి ఉద్యోగులకు పరిహారంగా ఇచ్చే కంపెనీ స్టాక్ ఆప్షన్లు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి ప్రోత్సాహకంగా కంపెనీలు స్టాక్ ఆప్షన్లను కేటాయిస్తూ ఉంటాయి. వీటిని ఉద్యోగి కావాలంటే ఈక్విటీ షేర్‌గా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.