Violence At Kejriwal Home: కేజ్రీవాల్ ఇంటి గేటు మీదకు ఎక్కిన బీజేపీ ఎంపీ, సీఎం ఇంటి దగ్గర బీజేపీ విధ్వంసం, కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ యత్నించిందని ఆప్ ఆరోపణ, సీఎం ఇంటి గేటుకు కాషాయరంగు పూసిన నిరసనకారులు

సీఎం కేజ్రీవాల్ ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై (The Kashmir Files) కేజ్రీవాల్ కామెంట్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో కార్యకర్తలు, కేజ్రీవాల్ ఇంటిపై దాడికి దిగారు. ఆయన ఇంటి ఎదుట బూమ్‌ బారియర్‌ను పగులగొట్టారు. అంతేకాదు కేజ్రీవాల్ ఇంటి గేటు మీద కాషాయ రంగును చల్లారు.

New Delhi, March 30: ఢిల్లీలో బీజేపీ (BJP) కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై (The Kashmir Files) కేజ్రీవాల్ కామెంట్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో కార్యకర్తలు, కేజ్రీవాల్ ఇంటిపై (Attack on Kejriwal Home) దాడికి దిగారు. ఆయన ఇంటి ఎదుట బూమ్‌ బారియర్‌ను పగులగొట్టారు. అంతేకాదు కేజ్రీవాల్ ఇంటి గేటు మీద కాషాయ రంగును చల్లారు. బీజేపీ కార్యకర్తల విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో (CCTV) రికార్డయ్యాయి. సీఎం ఇంటి ముందు ఆందోళన చేపట్టిన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వచ్చి కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటును ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య (MP Tejaswi Surya) బారికేడ్లు ఎక్కుతున్న దృశ్యాలు బయటికొచ్చాయి. దాదాపు 150 నుంచి 200 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం కేజ్రీవాల్‌ ఇంటి వద్ద బీజేపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. బీజేపీ పోలీసులు వారిని ఆపలేదు సరికదా.. గేటు వద్దకు తీసుకొచ్చారు’’ అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్లో షేర్‌చేస్తూ.. బీజేపీపై మండిపడింది. ‘‘పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయంతో ఉలిక్కిపడిన బీజేపీ.. కేజ్రీవాల్‌ను చంపాలని చూస్తోందా..?’’ అంటూ ఫైర్ అయింది.

అయితే బీజేపీ మాత్రం తమ ఆందోళనలను సమర్ధించుకుంది. ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ తేజస్వీ సూర్య. ఆయన క్షమాపణలు చెప్పేవరకు తాము ఆందోళనలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తన కామెంట్లపై భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికి చాలా రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తుండడంపై ఇటీవల కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండితుల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారన్న ఆయన.. ఈ సినిమాను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవచ్చు కదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కశ్మీర్‌ పండితులను కేజ్రీవాల్ అవమానిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.