Delhi Assembly Elections 2020: న్యూఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్, క్యూలైన్‌లో 6 గంటల పాటు నిరీక్షణ, సానుభూతి వ్యక్తం చేసిన ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, మరికొన్ని రోజుల్లో ఎన్నికలు
కేజ్రీవాల్ వస్తున్నారని తెలిసి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులను పంపుతున్నారు, కానీ....
New Delhi, January 21: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections 2020) ప్రక్రియ కొనసాగుతుంది. న్యూఢిల్లీ నియోజకవర్గం స్థానం నుంచి పోటీలో ఉన్న దిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన దాదాపు ఆరు గంటల ఇరవై నిమిషాల పాటు క్యూలైన్‌లో నిరీక్షించాల్సి వచ్చింది.
నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజు కావడంతో జామ్‌నగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో మంగళవారం సుమారు 100 మంది వరకు నామినేషన్ వేయడానికి వచ్చారు. తన నామినేషన్ పత్రాలతో కేజ్రీవాల్ మధ్యాహ్నమే రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, ఆయనకు టోకెన్ నెంబర్ 45 వచ్చింది. ఇక ముందు వరుసలో వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి, స్వీకరించే ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్ వంతు వచ్చేసరికి సాయంత్రం దాటింది. అప్పటివరకు ఆయన అదే క్యూలైన్‌లో ఓపికగా నిరీక్షించారు.
కేజ్రీవాల్ నిన్ననే నామినేషన్ వేద్దామనుకున్నా, ఆయన రోడ్ షో కారణంగా ఆలస్యం అవడంతో నిన్న నామినేషన్ సాధ్యపడలేదు.
కాగా, ఈ ఆలస్యం పట్ల ఆమ్ఆద్మీ పార్టీ నేతలు స్పందిస్తూ, కేజ్రీవాల్ నామినేషన్ ఆలస్యం చేసేందుకు కావాలనే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ వస్తున్నారని తెలిసి చాలా మంది స్వతంత్ర అభ్యర్థులను పంపుతున్నారు, కానీ ఆయన వేయకపోతే మిగతా వారు కూడా నామినేషన్ వేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఈరోజు అలాగే చేసి మా నేతను ఇబ్బంది పెట్టారు. అయినా మా నేత ఓపికగా ఉన్నారు. ఇలాంటి సీఎంను ఎక్కడైనా చూస్తారా? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
Saurabh Bharadwaj's tweet:
ఇదిలా ఉండగా, 2020 ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాల వెల్లడి జరుగుతుంది. 2013 మరియు 2015లో వరుసగా సీఎంగా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్, 2020లో హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.