Cash For Vote Scam: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు, ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ, చంద్రబాబుకు కష్టాలు తప్పవా?
ఆ ఆడియో టేపుల్లో...
Hyderabad, May 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసులో (Cash For Votes Scandal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పేరును ప్రధాన నిందితుడిగా పేర్కొంది. రేవంత్ తో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ సింహా, మత్తయ్య, వేమ్ కృష్ణ కీర్తన్ పేర్లను ఛార్జీషీట్ లో పేర్కొంది.
ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్న వారందరూ గతంలో టీడీపీ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమ్ నరేంద్ర రెడ్డికి మద్ధతుగా టిడిపికి అనుకూలంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్ సన్‌కు రూ. 5 కోట్లు బహుమతిగా అందిస్తూ ఆయనను లోబర్చుకునే ప్రయత్నం చేశారనేది వారిపై ప్రధాన అభియోగం.
అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు క్యాష్ ఇస్తుండగా అందుకు సంబంధించి ఆడియో- వీడియో టేపులు కొన్ని బయటకు లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎసిబి కేసుపై ఈడి మరింత లోతుగా దర్యాప్తు చేసి హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ముందు చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడి అధికారి ఒకరు వెల్లడించారు.
Here's the tweet by ED:
ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు పేరు లేకపోయినా, ఈ కేసుకు సంబంధించి 'మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ' అంటూ చంద్రబాబు మాట్లాడినట్లుగా కొన్ని ఆడియో టేపులు అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఆ ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదే అని అప్పట్లో ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి రావటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.