GHMC Mayor Poll: నేడే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక, ఎవరికీ దక్కని మ్యాజిక్ ఫిగర్- రేసులో మూడు పార్టీలు, టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కొనసాగుతున్న ఉత్కంఠ

తమ వ్యూహంలో భాగంగా MIM పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ చర్య టిఆర్ఎస్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులను పొందటానికి సహాయపడుతుంది....

GHMC Elections | (Photo-File Image)

Hyderabad, February 11:  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకు గురువారం రంగం సిద్ధమైంది. డిసెంబరులో జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బిజెపిల మధ్య ఎన్నో ఘర్షణలకు దారితీశాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్ ఈసారి జరిగిన ఎన్నికల్లో కనీసం మ్యాజిక్ ఫిగర్ ను కూడా సాధించలేకపోయింది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ దక్కలేదు. అయినప్పటికీ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎవరికి వారుగా వ్యూహాలు రచిస్తున్నాయి.

అయితే ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. మేయర్ మరియు డిప్యూటీ మేయర్ తమకే దక్కేలా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. పోలింగ్ సమయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసేందుకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు పార్లమెంటరీ పార్టీ నాయకుడు K కేశవ రావులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. ఇంతకాలం మేయర్ పీఠంపై ఎలాంటి లీకులు ఇవ్వని తెరాస, గురువారం పోలింగ్ రోజున ఒక మహిళ పేరును మేయర్ కోసం చీఫ్ విప్ కు ప్రతిపాదనగా పంపుతారని చెబుతున్నారు. తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్లలో అందజేస్తామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

మేయర్ పదవికి టిఆర్ఎస్ బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ వ్యూహంలో భాగంగా MIM పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ చర్య టిఆర్ఎస్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులను పొందటానికి సహాయపడుతుంది.

మొత్తం 150 డివిజన్లుండే గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ 56 డివిజన్లను కైవసం చేసుకోగా, బిజెపి 48 డివిజన్లను, ఎంఐఎం 44 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లతో చతికిలపడింది.

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 56 డివిజన్లతో పాటు 32 ఎక్స్‌-అఫిషియో సభ్యుల బలం కూడా ఉంది. మరోవైపు వారి మిత్ర పక్షం MIM లో 44 మంది సభ్యులు , 10 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు. మరోవైపు బీజేపీ తరఫున తాజాగా గెలిచిన ఓ కార్పోరేటర్ ఇటీవలే చనిపోయారు. దీంతో బీజెపి బలం 47 కి పడిపోయింది. బీజేపికి ఇద్దరు ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు.

నగరంలో ఓటు హక్కు కలిగిన లోక్ సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎంఎల్‌సిలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేయర్ ను ఎన్నుకునేందుకు హక్కును కలిగి ఉంటారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు గురువారం ఉదయం 10:45 గంటలకు మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి కొత్తగా గెలిచిన కార్పోరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు బల్దియా కాన్ఫరెన్స్ హాలులో అందుబాటులో ఉండాలని సూచించింది. ఉదయం 11 గంటలకు కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం 11:30 సమయానికి మేయర్, డిప్యూటీ మేయర్ కు సభ్యులు తమ మద్ధతు తెలపాల్సి ఉంటుంది.