Haryana Floor Test: రైతుల ఆందోళన బీజేపీ పట్టించుకోవడం లేదు, అందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని తెలిపిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, బల పరీక్షను ఎదుర్కోనున్న సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌పై (Manohar Lal Khattar-Led Government) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం (no-confidence motion) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ రాష్ట్ర సరిహద్దుల్లో 250 మంది రైతులు మృతి చెందారని చెప్పారు.
Chandigarh, March 10: హర్యానాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌పై (Manohar Lal Khattar-Led Government) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం (no-confidence motion) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ రాష్ట్ర సరిహద్దుల్లో 250 మంది రైతులు మృతి చెందారని చెప్పారు.
మృతి చెందిన రైతుల పేర్లతో సహా తాను వెల్లడిస్తే.. ఆ విషయం కనీసం పేపర్లలో కూడా కనిపించలేదని హుడా విమర్శించారు. రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా తాము ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని మాజీ ముఖ్యమంత్రి హుడా (Former Haryana CM B S Hooda) పేర్కొన్నారు.
ఇక బలబలాల విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 88 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో అధికార బీజేపీ సభ్యులు 40 మంది, దాని మిత్రపక్షమైన జేజేపీ సభ్యులు 10 మంది ఉన్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 30 మంది సభ్యుల బలం ఉండగా, ఇతరులు 8 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే అధికార పక్షానికి 44 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉన్నదని చెబుతున్నది. వారితో కలుపుకుని ప్రతిపక్షాల బలం 32కు పెరిగినా అధికారపక్షానికి వచ్చిన ఆపదేమీ లేనట్లే కనిపిస్తున్నది. ఎందుకంటే అధికార బీజేపీకి సొంతంగా 40 మంది సభ్యులు ఉండగా 10 స్థానాలున్న జేజేపీ, ఆరుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.
దీంతో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 56 ఓట్లు పడే అవకాశం ఉన్నది. అవసరానికి మించి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఇటీవల రైతులకు మద్దతు ప్రకటించిన కొందరు జేజేపీ ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసినా ఖట్టర్ సర్కారుకు వచ్చే నష్టమేమీ కనిపించడం లేదు.
కాగా, అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార కూటమిలోని బీజేపీ, జననాయక్ జనతాపార్టీ (జేజేపీ) మంగళవారం నాడే తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా బుధవారం ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని సూచించాయి. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ప్రతిఒక్క సభ్యుడు సభకు హాజరుకావాలని, సీఎల్పీ నేత ముందస్తు అనుమతి లేకుండా ఓటింగ్‌కు గైర్హాజరు కావద్దని ఆదేశాలు జారీచేసింది.