PV Narasimha Rao: సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి పీవీ నరసహింహారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఎప్పుడు అందలం ఎక్కుతామో, ఎప్పుడు ఏ పాము కరిచి పాతాళానికి పడిపోతామో ఎవరికీ తెలియదు. పీవీ నరసింహారావు...

భారతదేశం ఇప్పటివరకూ ఎంతో మంది లీడర్లను చూసింది. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ అప్పటివరకూ ఒకే కుటుంబానికి చెందిన వారే వారసత్వంగా దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ఆ ఆనవాయితీని ఛేదిస్తూ, 1991వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దక్షిణ భారత దేశం నుంచి ఒకవ్యక్తి, అందులోనూ తెలుగు వాడు అయిన పీవీ నరసింహారావు (P.V Narasimha Rao) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఒకసారి పగ్గాలు అప్పజెప్పిన తర్వాత ఇక ఆ దేశాన్ని ముందుకు సవ్యంగా నడిపించాలన్నా, లేదా పాతాళానికి తోసేయాలన్నా అంతా ఆ పాలకుడి చేతుల్లోనే ఉంటుంది. అయితే దేశం అనే బండి కదలాలంటే సరైన మార్గం, అందుకు సరిపోయే ఇంధనం ఉండాలి, సరైన మార్గదర్శి ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులేవి లేని సమయంలో, దేశం ముందుకు వెళ్లే పరిస్థితే లేని క్లిష్ట సమయంలో పీ.వీ నరసింహారావు ఈ దేశ పగ్గాలను స్వీకరించాడు. ఈ దేశంలో ఎన్నో మంచి మంచి ఆర్థిక సంస్కరణలను (Economic Reforms) చేపట్టి దేశ ఆర్థికవ్యవస్థకు ఒక ఆకారం ఇచ్చి, ప్రజల్లోఆర్థిక భద్రత, ఒక నమ్మకం కల్పించడంలో పీవీ ఎంతో కృషి చేశారు. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల జాతిపిత (father of Indian economic reforms) గా కీర్తి.

పీవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు:

జూన్ 28, 1921న అప్పటి హైదరాబాద్ రాష్టం (ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం), కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో, బ్రాహ్మణ కుటుంబంలో పీవీ నరసింహారావు జన్మించారు.

1947 ఆగష్టు 15న ఇండియా అంతటా స్వాతంత్ర సంబరాలు జరుగుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్ రాష్టంలో నిజాం పాలన నడిచేది. అప్పట్లో తమ స్వాతంత్రం

కోరుతూ, నిరంకుశంగా సాగుతున్న నిజాం పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు   (జనంలో నుంచే కొంతమంది తమకుతాముగా సైన్యంగా మారి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం) జరుగుతున్న రోజులవి, అయితే అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి చంపేయాలని నిజాం నవాబు ఆదేశాలు ఉన్నాయి. అలాంటి సమయంలోనూ పీవీ తనకుతానుగా గెరిల్లా పోరాటయోధుడిగా సిద్ధమై నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎంతో ధైర్య, సాహసాలను ప్రదర్శించారు.

బహుభాషాకోవిదుడు

పీవీకి అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. తెలుగు, ఉర్దూ, అరబిక్, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, తమిళం, సంస్కృతంలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్ మరియు పర్షియన్ లాంటి విదేశీ భాషలలో మంచి పట్టు ఉండేది. మొత్తంగా 17 భాషలలో అనర్గళంగా ప్రసంగించేవారు. కొన్ని అమూల్యమైన సాహితీ గ్రంథాలను వివిధ భాషల్లోకి ట్రాన్స్ ;లేట్ చేశారు కూడా.

రాజకీయరంగ ప్రవేశం

స్వాతంత్ర పోరాటోద్యమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా పీవీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1971 నుంచి 1973 వరకు పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ రెండేళ్ల కాలంలోనే ఎంతో పటిష్ఠమైన చట్టాలు తీసుకువచ్చారు. ఇప్పుడు భూమికి సంబంధించిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చట్టం పీవీ హయాంలో తీసుకురాబడిందే. కేంద్రంలో కూడా హోం మంత్రిగా, డిఫెన్స్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పదవులు చేపట్టారు. 1991లో ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నుంచి పోటీ చేసిన పీవీ 5 లక్షల ఓట్ల రికార్డ్ మెజీరిటీతో గెలుపొందారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.

దక్షిణ భారతదేశం నుంచి తొలిప్రధాని

పీవీ నరసింహరావు ప్రధానిగా ఎన్నికవడం కూడా ఒక రికార్డ్. నెహ్రూ- గాంధీల కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తి ప్రధాని అవడం అదే తొలిసారి, సౌత్ ఇండియా నుంచి మరియు నాన్- హిందీకి చెందిన వ్యక్తి ప్రధాని అవడం కూడా అదే తొలిసారి. ఈ రకంగా ప్రధాని అయి పూర్తిగా ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన ఏకైక వ్యక్తి కూడా పీవీనే.

ఆర్థికసంస్కరణకర్త

పీవీకి నవభారత నిర్మాణ సృష్టికర్తగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుంది. వడ్డీరేట్లను తగ్గించడం, భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అనుమతించడం పీవీ హయాం నుంచే మొదలైంది.

అపర చాణక్యుడు, గొప్ప లీడర్

పీవీ ఒక మంచి రాజకీయ వ్యూహకర్త, అపర చాణక్యుడిగా పేరు. అంతకుమించి ఒక గొప్ప లీడర్. ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా నెం.1 ప్రధానమంత్రిగా ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి పీవీ.

రాజనీతిజ్ఞుడు

ఇప్పట్లో రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు, ప్రతిపక్షం, అధికారపక్షం ఎవరైనా, పార్టీలు ఏవైనా ఎదుటి వారిలో ఎక్కడా తప్పుదొరుకుతుందా , ఎప్పుడు అందులో వారిని ఇరికించాలా, ప్రజల ముందు నిలదీసి తాము క్రెడిట్ కొట్టేద్దామనే చూస్తారు తప్ప ఎవరూ ప్రజా ప్రయోజనాలు ఆశించరు. కానీ పీవీ రాజకీయంలో ఒకనీతిని పాటించారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయి పీవీకి రాజకీయ ప్రత్యర్థి. కానీ, దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు అవసరం అని భావించినపుడు రాజకీయాలను పక్కనపెట్టి, ప్రతిపక్ష నాయకులను పీవీ కలుపుకొని పోయేవారు. పైపైనే తాము ప్రజల కోసమే అని వట్టి మాటలకు చెప్పకుండా నిజంగా ప్రజలకు తగిన ఫలాలకు అందించడంలో తపన చూపించేవారు.

కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కుట్రలు చేస్తున్న సమయం. అప్పుడు అమెరికా, చైనా దేశాల సపోర్ట్ కూడా పాక్ కు సపోర్ట్ చేసేవి, భారత్ ఒంటరిగా ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయ ప్రయోజనాలు ఏమాత్రం ఆశించకుండా అప్పట్లో తన ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజిపేయిని ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశానికి వెళ్లి భారత్ వాణిని గట్టిగా వినిపించాల్సిందిగా కోరారు. దీనిని గౌరవంగా భావించిన వాజిపేయి ఐకాస సమావేశానికి వెళ్లి పాకిస్థాన్ కుట్రలను ఎండగట్టడంతో అప్పట్లో పాక్ నోరు మూతబడింది.

భారతదేశ రాజకీయ రణక్షేత్రంలో నెగ్గుకు రావడం అంటే అది ఒక మహాభారత యుద్ధం లాంటిది, పాము-నిచ్చెన ఆట లాంటింది. ఎప్పుడు అందలం ఎక్కుతామో, ఎప్పుడు ఏ పాము కరిచి పాతాళానికి పడిపోతామో ఎవరికీ తెలియదు. పీవీ నరసింహారావు దేశప్రయోజనాల కోసం ఎంతో నిజాయితీగా కష్టపడ్డారు, దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించారు. అయినప్పటికీ ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు.