J&K Governor Warning: పాకిస్థాన్ లోపలికి చొచ్చుకు వస్తాం! ఈసారి భారత ఆర్మీ సరిహద్దు దాటి దాడులు చేస్తుందని పాకిస్థానీ టెర్రరిస్టులను హెచ్చరించిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్
దీంతో ఇకపై భారత్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు పాకిస్థాన్ లోకి అనుమతించబడవు.
Srinagar, October 21: సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత ఆర్మీ దాడులు చేసి ఒక్కరోజు కూడా గడవకుండానే జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Governor Satya Pal Malik) మరోసారి పాకిస్థాన్ ను హెచ్చరించారు. పాకిస్థానీ టెర్రరిస్టులు తమ స్థావరాలను ఖాళీ చేయకపోతే ఈసారి భారత ఆర్మీ సరిహద్దు దాటి "లోపలికి" చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తాయని సత్యపాల్ హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు శతఘ్ని ఫిరంగుల ద్వారా పాక్ టెర్రర్ క్యాంపులపై 'స్మార్ట్'గా దాడి చేసి, పాకిస్థాన్ కు చెందిన నాలుగు టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను వేసిన విషయం తెలిసిందే. ఈ దాడులలో అనేక మంది ఉగ్రవాదులు సహా కొంతమంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారు.
Jammu and Kashmir Governor Satya Pal Malik's Statement:
"జమ్మూకాశ్మీర్ లోని లీపా లోయ అని పిలువబడే ప్రాంతంలో కేరన్, తంగ్ధర్ మరియు నౌగామ్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో టెర్రర్ క్యాంపులు పనిచేస్తున్నాయని మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. వీటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం, ఈ దాడుల్లో కనీసం 6-10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అలాగే పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు". అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) మీడియాతో వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో, ఆర్టికల్ 370 పై చర్చ సందర్భంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగమని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) మరియు చైనా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ రెండూ కూడా భారతదేశంలో భాగమేనని పేర్కొన్నారు. POKను కాపాడుక్ఫోటానికి ప్రాణాలైన వదులుకునేందుకు సిద్ధమే అని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, అమిత్ షా ఈ విషయాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారు.
అప్పటి నుండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా తిరిగి భారత్ లో కలిపేయడం అనే అంశాన్ని బీజేపి బలంగా వాదిస్తూ వస్తుంది. సెప్టెంబరులో, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో POKను ఏకీకృతం చేయడం ఇప్పుడు మోడీ ప్రభుత్వ ఎజెండాలో తదుపరిది. అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భారత ఆర్మీ దూకుడు ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతుంది, ఏ చిన్న అవకాశం దొరికినా పాకిస్థాన్ స్థావరాలపై ఆర్మీ విరుచుకుపడుతుంది.
భారత చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, ఇరుదేశాలకు మధ్య పోస్టల్ సేవలను నిలిపి వేసింది. దీంతో ఇకపై భారత్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు పాకిస్థాన్ లోకి అనుమతించబడవు.