New Delhi, October 21: గత నెలలోనే భారత ఆర్మీ (Indian Army) పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. సరిహద్దు వద్ద పాకిస్థాన్ చర్యలు తాము గమనిస్తున్నామని, ఈసారి తాము చేయబోయే దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కు మించి ఉంటాయని సూటిగా చెప్పింది. అన్నట్లే, హెచ్చరించిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. ఎంతగా అంటే, గతంలో భారత్ ఎప్పుడు దాడి చేసినా, తమపై ఎలాంటి దాడి జరగలేదని, ఎలాంటి నష్టం కలగలేదని చెప్పుకునే పాకిస్థాన్, ఈసారి మాత్రం భారత్ 'అత్యంత క్రూరంగా' ప్రవర్తించింది, మా పౌరులను, ఒక సైనికుడిని చంపేసింది. అయితే మేము కూడా గట్టిగా జవాబిచ్చాం, భారత సైనికులే ఎక్కువగా చనిపోయాంటూ పాకిస్థాన్ ప్రకటించుకుంది. పాక్ మీడియా కూడా అంతర్జాతీయ సమాజం భారత చర్యలను గమనించాలంటూ ఎప్పట్లాగే కథనాలు వండి వడ్డిస్తుంది. కొన్ని రోజుల కిందటే పాకిస్థాన్ ను హెచ్చరించిన భారత ఆర్మీ, చదవండి.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఎల్లప్పుడూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేలా అనుకూల వాతావరణం కల్పించేది. అయితే పరిస్థితులు ఇప్పుడలా లేవు, పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే భారత ఆర్మీ ఒక అడుగు ముందుకు వేసి అంతకు రెట్టింపు స్థాయిలో జవాబిస్తుంది. నిజం చెప్పాలంటే, పాకిస్థాన్ ఇలాంటి ఉల్లంఘనలకు ఎప్పుడు పాల్పడుతుందా, ఎప్పుడు అటాక్ చేద్దామా అని ఇండియన్ ఆర్మీ కాచుకు కూర్చుంటుంది. శనివారం నాడు తంగ్దార్ సెక్టార్ వెంబడి విచక్షణారహితంగా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది, ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక ఎంతమాత్రం ఉపేక్షించని భారత ఆర్మీ నేరుగా శతఘ్నులతో రంగంలోకి దిగింది. ఇటీవలే కొత్తగా యూఎస్ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన 155 MM ఎక్స్‌కాలిబర్ ఆర్టిలరీ మందుగుండు సామగ్రిని (The Excalibur shell) పాక్ ఉగ్రస్థావరాలపై ప్రయోగించింది. ఈ దెబ్బతో ఒక్కొక్క ఉగ్రస్థావరంలో నక్కిన 10 నుంచి 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 10 మంది వరకు పాక్ సైనికులు చనిపోయారు. మొత్తంగా లెక్కేస్తే సుమారు ఓ 40 మంది వరకు హతమైనట్లు తెలుస్తుంది.
ఎక్స్‌కాలిబర్ ఆర్టిలరీ షెల్స్ ప్రత్యేకత ఏంటి?
ఎక్స్‌కాలిబర్ ఆర్టిలరీ షెల్ ద్వారా ఎక్కువ దూరం వరకు మందు గుండ్లను కాల్చవచ్చు. ఇవి ఉపగ్రహ మార్గదర్శంతో (satellite guidance) పనిచేస్తూ, GPSను ఉపయోగించుకొని ఖచ్చితమైన లక్ష్యాలను పేల్చేస్తుంది. నేరుగా 57 కిలోమీటర్ల దూరం నుంచే అనుకున్న లక్ష్యాలను పేల్చేయవచ్చు, దాదాపు ఇవి లక్ష్యాలను మిస్ కావు, ఒకవేళ అయినా, షెల్ దాని ఉద్దేశించిన లక్ష్యం నుండి 2 మీటర్ల లోపే పడవచ్చు.
సాధారణంగా పాకిస్థాన్, జనావాసాల మధ్యే ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. ఉగ్రవాదులను ఏరేసే క్రమంలో ఆర్మీ ప్రయోగించిన షెల్స్, గురితప్పి పక్కనపడితే సాధారణ ప్రజల ప్రాణాలకు, వారి ఆస్తులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనినే పాకిస్థాన్ అడ్వాంటేజ్ గా తీసుకొని సాధారణ పౌరులపై భారత్ మారణకాండ చేస్తుందని అంతర్జాతీయంగా దుష్ప్రచారం చేస్తూ వస్తుంది. ఇందుకోసమే, ఈసారి పాకిస్థాన్ కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇలాంటి శాటిలైట్ గెడెడ్ షెల్స్ ను ప్రయోగించింది.
ఎక్స్‌కాలిబర్‌ను యుఎస్ కంపెనీ రేథియాన్ మరియు ఎంఎన్‌సి బిఎఇ సిస్టమ్స్ తయారు చేస్తున్నాయి. యూఎస్ వీటిని ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ యుద్ధంలో ఉపయోగించింది. ఇప్పటివరకు అమెరికా వీటిని కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్ దేశాలకు అమ్మగా, ఇప్పుడు భారత్ కూడా వీటిని సొంతం చేసుకుంది. ఇవే కాక, 145 ఎం 777 హౌటిజర్‌ల కొనుగోలు కోసం కూడా భారత్ రూ .5,070 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసింది.