Army chief General Bipin Rawat | Photo Credits: PTI

Chennai, September 23: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో భారత సైన్యం జరిపిన భీకర సైనిక చర్యలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి జైష్-ఇ-మహ్మద్ కు చెందిన అతిపెద్ద బాలాకోట్ ఉగ్రశిబిరం  (Balakot Terror Camp) తుడుచుకుపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ మాపై ఎలాంటి దాడి చేయలేదు, అసలు అక్కడ ఉగ్రశిబిరాలు అనేటివే లేవంటూ నాటకాలు ఆడింది. అయితే తాజాగా మళ్ళీ పాకిస్థాన్ అక్కడ ఉగ్రవాద శిబిరాన్ని ప్రారంభించినట్లు భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) పేర్కొన్నారు. ఈ శిబిరం ద్వారా శిక్షణ పొందుతున్న సుమారు 500 మంది ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిపిన్ రావత్ ఈ విషయాలను వెల్లడించారు. గతంలో భారత వైమానిక దళం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ వలన తమకు ఎలాంటి నష్టం జరగలేదని వాదించిన పాకిస్థాన్, ఇప్పుడు మళ్ళీ ఉగ్రశిబిరాన్ని ప్రారంభించడం అంటే వారికి అప్పుడు భారీనష్టం జరిగిందని అంగీకరించడమే అని రావత్ అన్నారు. పాక్ చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన రావత్, ఈసారి భారత్ రియాక్షన్ గతంలో జరిగిన బాలాకోట్ దాడులకు మించి ఉంటుందని హెచ్చరించారు.

Bipin Rawat Addressing Media:

జమ్మూకాశ్మీర్ లో కలిగే వాతావరణ మార్పుల కారణంగా మంచు కరిగుతుందని, ఈ నేపథ్యంలో ఉత్తర దిశ నుంచి జమ్మూకాశ్మీర్ లో అక్రమంగా చొరబడేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని రావత్ తెలిపారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే అదనపు భద్రతాదళాలను ఆయా ప్రాంతాల్లో మోహరింపజేశామని ఆయన స్పష్టం చేశారు.

జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితి అంతా సాధారణంగానే ఉంది, వ్యాపారాలు సజావుగానే సాగుతున్నాయి, ప్రజల మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతుంది. ఇక్కడ నిర్భంధ వాతావరణం ఉందనడం కేవలం ఉగ్రమూకల దుష్ప్రచారమే అని రావత్ తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల ఎత్తివేత గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.