MH Elections 2019: మహారాష్ట్రలో ఎగిరేది మళ్ళీ కాషాయ జెండానే! ఓపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించిన సీ-ఓటర్ సర్వే, బిజేపీ- శివ్ సేన పార్టీలకు అత్యధిక సీట్లు, కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందన్న సర్వే
2014 వరకు మూడు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి అధికారాన్ని చెలాయించింది. అయితే 2014 ఎన్నికల సమయంలో ఈ కూటమి రెండుగా విడిపోయి విడివిడిగా పోటీచేసి ఘోరంగా నష్టపోయాయి.
Mumbai, October 18: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections 2019) లో బీజేపి-శివసేన కూటమి 194 స్థానాలను గెలుచుకుంటుందని సీ- ఓటరు (C Voter) సమన్వయంతో ఎబిపి న్యూస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాల ద్వారా వెల్లడైంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూటమి 86 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది.
అసుదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్, ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని బహుజన్ వంచిత్ అగాదీతో సహా ఇతరులు కేవలం 8 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ సేకరణ వివరాలను తెలిపింది.
ఇక ఓటు షేర్ విషయానికొస్తే, బీజేపి-శివసేన కూటమి మొత్తం ఓట్లలో 47 శాతం సాధిస్తుందని అంచనా. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 39 శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది, ఇతరులు అంతా కలిసి 14 శాతం ఓట్లను సాధిస్తారని భావిస్తున్నారు. ఒక్క సీ-ఓటర్ సర్వేనే కాకుండా చాలా సర్వేలు మహారాష్ట్రలో ఈసారి కూడా బీజేపీ-శివసేన కూటమికి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
ఎబిపి న్యూస్-సి ఓటరు ఒపీనియన్ పోల్ ఫలితాలు:
పార్టీ | గెలవబోయే స్థానాల అంచనా |
బీజేపి-శివసేన | 194 |
కాంగ్రెస్-ఎన్‌సీపీ | 86 |
ఇతరులు | 8 |
మహారాష్ట్ర ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 2014 వరకు మూడు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి అధికారాన్ని చెలాయించింది. అయితే 2014 ఎన్నికల సమయంలో ఈ కూటమి రెండుగా విడిపోయి, రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసి ఘోరంగా నష్టపోయాయి. ఆనాడు ఈ రెండు పార్టీలకు వరుసగా 42 మరియు 41 సీట్లను గెలుచుకున్నాయి. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాషాయ దళం మహారాష్ట్రలో జెండా పాతింది. 2014లో బిజేపీ- శివసేన కూటమికి 185 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2019లో కూడా దాదాపు అవే ఫలితాలు రిపీట్ అవుతాయని సర్వేలు చెప్తున్నాయి. అయితే తప్పును గ్రహించి మళ్ళీ జతగా పోటీ చేస్తున్న కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమికి గత ఫలితాలలో ఎలాంటి మార్పు ఉండబోదని సర్వేలు తేల్చి చేప్తున్నాయి.
మహారాష్ట్రలో సింగిల్-ఫేజ్‌లో నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ఎన్నికలు ఈ అక్టోబర్ 21న జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు ప్రకటించబడతాయి.