Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాకరే సర్కారును కూల్చాలంటే బలమెంత ఉండాలి, ఇంతకీ ఏకనాథ్ షిండే ఎవరు, ఎంతమంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలడు, మహా రాజకీయాలపై స్పెషల్ స్టోరీ
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి (Maharashtra Political Crisis) దారితీసింది.
Mumbai, June21: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో రాజకీయం వేడేక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి (Maharashtra Political Crisis) దారితీసింది. అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. శివసేన నేతృత్వంలోని కూటమి కుప్పకూలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు పావులు కదుపుతోంది.
ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే (Ekanath Shinde) పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఎవరనే ఆరా మొదలైంది. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో మకాం వేసిన షిండే.. ముంబైకి సమీపంలోని థానేకు చెందినవారు. పార్టీని ఇతర ప్రాంతాల్లోనూ బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. సీఎం ఉద్దవ్ థాకరేకు నమ్మిన బంటు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఆయన ఆదిత్య థాకరేతో కలిసి అయోధ్య కూడా వెళ్లారు.
ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు పర్యాయాలు (2004, 2009, 2014, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. థానే పరిసర ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు. ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, పలువురు సేన ఎమ్మెల్యేల నుంచి కూడా ఆయన గట్టి మద్దతు ఉంది.
శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) 21 మంది ఎమ్మెల్యేలను(మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు) వెంటబెట్టుకుని గుజరాత్(Gujarath)కు మకాం మార్చారు. సూరత్ నగరంలోని మెరీడియన్ హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం. దీంతో సీఎం ఉద్ధవ్ థాకరే(Uddav Thackerey) ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ‘అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ(NCP) ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ.. మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందన్నారు. శివసేనకు చెందిన 22 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ శివసేన నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న నారాయణ్ రాణె స్పందిస్తూ.. కారణం ఏంటో తెలియకుండా ఇలాంటి అంశాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏక్‌నాథ్ షిండే మధ్యాహ్నం మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అధికారి శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పార్టీకి ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
తన భర్త కనిపించడం లేదంటూ సేన ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు
ఇదిలా ఉంటే తన భర్త కనిపించడం లేదంటూ శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నితిన్ దేశ్‌ముఖ్ బాలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల్లో నితిన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యే నితిన్ భార్య ప్రంజలి అకోలా పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తూ.. తన భర్తతో తాను చివరిసారి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మాట్లాడానని, ఆ తర్వాతి నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సూరత్ వెళ్లిన దేశ్‌ముఖ్ అనారోగ్యం బారినపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది.
ఎవరిబలమెంత?
ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి. బహుజన్ వికాస్ అగాధీకి మూడు, సమాజ్‌వాదీ, ఎంఐఎం, జనశక్తి పార్టీలకు చెరో రెండు సీట్లు ఉన్నాయి. ఎంఎన్ఎస్, సీపీఐ, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జనసూరజ్యశక్తి, క్రాంతికార్ షేత్కారి పార్టీలకు ఒక్కొక్క సీటు ఉన్నాయి. వీరితో పాటు 13 మంది స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 144 సీట్లు ఉంటే సరిపోతుంది.