Nayab Singh Saini: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ, సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, ఇంతకీ ఎవరీ సైనీ ?
సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా..నయాబ్ (Nayab Singh Saini) ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది.
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ని ఆ రాష్ట్ర బీజేఎల్పీ ఎన్నుకుంది. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా..నయాబ్ (Nayab Singh Saini) ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నయాబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు.అలాగే కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ).
ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు.
2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.