Rahul Gandhi Counter to PM Modi: ప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టైల్. 'నిజమైన సమస్యలపై' ఫోకస్ చేయండి మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

ప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే ప్రధాని మోదీ స్టైల్! ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ మొదలైనవాటి అన్నింటి గురించి మాట్లాడుతారు, కాని అసలు సమస్యల గురించి కాదు" అని రాహుల్ మండిపడ్డారు.....

Congress leader Rahul Gandhi (Photo Credits: IANS/File)

New Delhi, February 6:  ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని, గత పాలనను తీవ్రస్థాయిలో విమర్శించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  స్పందించారు. తమ పార్టీని నిలదీయడమే కాకుండా, దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Pandit Nehru) ప్రస్తావన కూడా తేవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు తమ ప్రభుత్వం కొద్దికాలంలోనే పరిష్కరించగలిగింది అని సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశం దృష్టిని మరల్చేందుకు చేసే అనవసర సమస్యల పరిష్కారంపై కాకుండా దేశాన్ని పీడిస్తున్న "నిజమైన సమస్యలపై" ఫోకస్ చేయాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచించారు.

దేశంలో నిరుద్యోగం (Unemployment) దూసుకుపోతుంది, యువతకు ఉద్యోగాలను సృష్టించే అంశంపై మోదీ ఏం మాట్లాడరు. ఆర్థిక మందగమనంకు (economic slowdown) సంబంధించిన ప్రశ్నలను అణిచివేసేందుకు ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగానే పాకిస్తాన్‌ను తన ప్రసంగంలోకి తీసుకువస్తున్నారు.

భారత ఆర్థికవ్యవస్థను సరైన రీతిలో నిర్వహించలేని ఈ మోదీ ప్రభుత్వం, తమ చేతకానితంపై నిలదీతను తప్పించుకోవడం కోసం ఎప్పటివో పురాతన సమస్యలను, భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను సైతం నేడు సభలో చర్చకు తీసుకువస్తున్నారని రాహుల్ విమర్శించారు.

"ఈరోజు అతిపెద్ద సమస్య నిరుద్యోగం మరియు ఉపాధి కల్పన. మేము చాలాసార్లు ప్రధానిని అడిగాము, కానీ ఆయన దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతకుముందు వారి ఆర్థిక మంత్రి కూడా సుదీర్ఘ ప్రసంగం చేసారు, కానీ ఆమె కూడా దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అని రాహుల్ అన్నారు. "ప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే ప్రధాని మోదీ స్టైల్! ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ మొదలైనవాటి అన్నింటి గురించి మాట్లాడుతారు, కాని అసలు సమస్యల గురించి కాదు" అని రాహుల్ మండిపడ్డారు.

Here's Rahul Gandhi's Statement: 

అంతకుముందు లోక్‌సభలో 'రాష్ట్రపతి ప్రసంగం'పై ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రతిపక్షాలపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మరియు వామపక్షాలు ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే పని అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం, అయోధ్య రామ్ మందిర్ మరియు ఆర్టికల్ 370 రద్దు సమస్య దశాబ్దాలుగా నిలిచిపోయాయని మోదీ విమర్శించారు.  ఏం చేశారు మీరు ఈ దేశానికి? కాంగ్రెస్ పార్టీ- యూపీఎ పాలనపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ

పాకిస్తాన్ ఏర్పడటానికి కారణం కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేత నెహ్రూనే అని మోదీ నిందించారు, బ్రిటిష్ వారి నుంచి పాలనా పగ్గాలు చేపట్టేందుకు దేశాన్ని విభజించారని మోదీ ఆరోపించారు. ఇదే అంశాన్ని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తో ముడిపెడుతూ "అప్పట్లో పండిట్ నెహ్రూ కూడా పాకిస్థాన్ లోని మైనార్టీలను రక్షించడానికి అనుకూలంగా వ్యవహరించారు. మరి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడగదల్చుకున్నాను, ఆనాడు ఇలా వ్యవహరించిన నెహ్రూ మతతత్వవాదా? ఆయనకు హిందూ రాజ్యం కావాలా"? అని నరేంద్ర మోదీ సభలో వ్యాఖ్యానించారు.