Rajinikanth Politics: ఆ దేవుడు నన్ను హెచ్చరించాడు, రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన, అభిమానులంతా నన్ను క్షమించాలని కోరిన తలైవా
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ (Rajinikanth To Not Launch Political Party) మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ (Rajinikanth To Not Launch Political Party) మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని (Will not be launching political party) తలైవా తేల్చి చెప్పారు. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు ( 'Warning given by the Lord') లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.
ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీ.. నేరుగా చెన్నై చేరారు. అయితే ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
అయితే రజినీ ప్రకటన వెనక ఆయన కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాలు వద్దని ... అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు చెన్నైలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య తీవ్రంగా తల్లడిల్లారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వద్దని రజినీని కోరారని వార్తలు వస్తున్నాయి. నిత్యం అవే ఆలోచనలతో ఉంటున్న కారణంగా... మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారని సమాచారం.
దయచేసి రాజకీయ ప్రకటన విరమించుకోవాలని అభ్యర్థించడంతో చేసేది లేక ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని మంగళవారం ప్రకటించారు. తన ఆలోచనలను, అందరి ఆందోళనలను ఆ ప్రకటనలో తెలిపారు. మూడు పేజీల లేఖను విడుదల చేస్తూ.. తన ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అందరికీ క్షమాపణలు చెప్పారు.
ప్రసార మాధ్యమాల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో ప్రచారం చేసి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావడం సాధ్యం కాదు. లక్షలాది మంది ప్రజల్ని నేరుగా కలిసి వారితో చర్చిస్తేనే రాజకాయాల్లో సమూల మార్పు సాధ్యపడుతుంది. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో అది అసంభవం. అంతేకాదు కరోనా కొత్త రూపాన్నీ సంతరించుకుంటోంది. ఈ పరిణామాలన్నింటికీ గమనించే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను’ అంటూ రజినీకాంత్ తన లేఖలో పేర్కొన్నారు.
తీవ్రమైన రక్తపోటు, అలసట కారణంగా రజనీ డిసెంబరు 25న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లిపోయారు. దీంతో కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుని మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారందరికీ షాక్ ఇస్తూ రజినీకాంత్ తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.