Sonia Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న సోనియా గాంధీ, అక్కడి కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు, తృణమూల్ కాంగ్రెస్, బీజెపీలను ఓడించడమే ధ్యేయంగా పావులు
బిజెపిని కిందకు దింపడమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
Kolkata,October 12: దేశ రాజకీయాలను బిజెపి ఒంటిచేత్తో శాసిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సరికొత్తగా ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. బిజెపిని కిందకు దింపడమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని కాంగ్రెస్ నేతలకు కీలక సూచనలు చేశారు. బిజెపి, తృణమూల్‌ను ఓడించడానికి లెఫ్ట్ ఫ్రంట్ నేతలతో కలిసి పనిచేయాలని సోనియా గాంధీ సూచించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత అబ్దుల్ మన్నన్ సారథ్యంలో ఓ బృందం సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలు, బెంగాల్ తాజా రాజకీయ పరిస్థితిపై ఆయన సోనియాతో చర్చించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారానికి దగ్గరగా వెళ్తోందని, దానికి అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్, లెఫ్ట్ ఓ కూటమిగా ఏర్పడి, ఉద్యమాలు చేయడమే శరణ్యమని సోనియాగాంధీ ఈ భేటీ సంధర్భంగా అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
బెంగాల్‌లోని రాజకీయ పరిస్థితులను తాము సోనియా గాంధీతో చర్చించామని సీనియర్ కాంగ్రెస్ నేత మన్నన్ తెలిపారు. బీజేపీని నిలువరించడానికి లెఫ్ట్, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని సోనియా తమతో చెప్పారని ఆయన అన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వామపక్ష, కాంగ్రెస్ కూటమి చెక్కు చెదరకుండా ఉందని ఆయన అన్నారు, బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని, అక్కడ బీజేపీ ఎన్నడూ పుంజుకోలేదు అని సోనియా తమతో అభిప్రాయపడ్డారని బెంగాల్ ప్రతిపక్ష నేత అబ్దుల్ మన్నన్ తెలిపారు. కాగా బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బిజెపి క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-ఎల్‌ఎఫ్ కూటమికి సోనియా అంగీకారం తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ , లెఫ్ట్ ఫ్రంట్ భారీ ఓటమిని మూటగట్టుకున్నాయి. కాంగ్రెస్ కేవలం రెండు ఎంపీ సీట్లలో మాత్రమే గెలిచింది. 39 చోట్ల డిపాజట్లను కోల్పోయింది. కాగా లెఫ్ట్ ఫ్రంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. పోటీ చేసిన అన్నీ చోట్ల భారీ ఓటమిని మూటగట్టుకుంది. 39 చోట్ల డిపాజిట్లే దక్కలేదు. బిజెపి ఇక్కడ అనూహ్యంగా పుంజుకుని మొత్తం 42 సీట్లలో 18 సీట్లను కైవసం చేసుకుంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా 22 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా 2021లో బిజెపి ఇక్కడ పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది.