Rahul Gandhi's Reaction: 'జమ్మూకాశ్మీర్‌ను రెండుగా విభచించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు'. కాశ్మీర్ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ.
ఎవరి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా జమ్మూకాశ్మీర్ ను రెండుగా విభచించడం ఎలాంటి జాతీయ సమగ్రత అనిపించుకోదని రాహుల్ గాంధీ విమర్శించారు...
New Delhi, 6th August-2019. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జమ్మూకాశ్మీర్ అంశం పట్ల కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ స్పూర్థికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం వ్యహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తమ అధికారాలను ఉపయోగించి జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని తీసివేస్తూ కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ ప్రాంతంలో ఎలాంటి శాంతిని నెలకొల్పగా పోగా మున్ముందు ఇంకా అల్లర్లను ప్రేరేపిస్తుందని, మొత్తం జాతీయ భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవరి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా జమ్మూకాశ్మీర్ ను రెండుగా విభచించడం ఎలాంటి జాతీయ సమగ్రత అనిపించుకోదు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్భంధం చేసి ఆ ప్రాంత హక్కులను తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశం అంటే మనుషులతో ఏర్పడింది అంతేకాని, భూములతో ఏర్పడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్:
ఇదిలా ఉండగా ప్రస్తుతం కాశ్మీర్ అంశంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలపై లోకసభలో చర్చ జరుగుతుంది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ లోకసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై కొన్ని ఊహాగానాలు మినహా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, కేంద్రం రాజ్యాంగ స్పూర్థికి విరుద్ధంగా వ్యవహరించిందని వారు ఆరోపించారు.
అయితే కాశ్మీర్ విషయం కాంగ్రెస్ పార్టీ కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఆ పార్టీలోనే సఖ్యత లోపించినట్లు కనిపిస్తుంది. సోమవారం రాజ్యసభలో ఈ విషయంపై జరిగిన చర్చ సందర్భంగా ఆమ్ ఆద్మీ, వైఎస్ఆర్పీ, టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులతో పాటు కొంతమంది కాంగ్రెస్ సభ్యులు కూడా మద్ధతు తెలపటంతో బీజేపీకి బలం లేని రాజ్యసభలో కూడా కాశ్మీర్ విభజన బిల్లు పాస్ అయిపోయింది.