Telugu Trend in 'Maha' Election: మహారాష్ట్రలో 'రావాలి జగన్, కావాలి జగన్' పాటను పోలిన శివసేన ఎన్నికల ప్రచార గీతం, తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం
కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిల్లోకి తీసుకెళ్లేలా శివసేన పార్టీ...
Mumbai, October 15: మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గానూ అక్టోబర్ 21న ఎన్నికలు (Maharashtra Legislative Assembly Election -2019) జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు పొత్తు పెట్టుకొని అధికారాన్ని కైవసం చేసుకున్నాయి 2014 ఎన్నికల్లో బీజేపికి (BJP) 122 సీట్లు , శివసేన (Shiv Sena) కు 63 సీట్లు రాగా, కాంగ్రెస్ (INC) పార్టీ కేవలం 42 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ + శివసేనల మైత్రి కొనసాగుతుంది. ఈసారి కూడా అధికారాన్ని ఛేజిక్కించుకునే దిశగా బీజేపీ + శివసేన ప్రచారంలో ముందున్నాయి. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదివరకే ఎన్నికలు పూర్తిచేసుకుని ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ మరియు ఏపీలో వైసీపీ ప్రచార సరళిని శివసేన అనుకరిస్తున్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిల్లోకి తీసుకెళ్లేలా శివసేన పార్టీ ప్రచార గీతాలను, ప్రకటనలను రూపొందించుకుంది.
ముఖ్యంగా మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా 'రావాలి జగన్ - కావాలి జగన్' అనే నినాదంతో రూపొందించిన ప్రచార గీతం ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లింది. వినసొంపుగా ఉన్న ఈ గీతం జనాల నోళ్లలో నాని జగన్ పై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని ఏర్పర్చడంలో ముఖ్యభూమిక పోషించింది. యూట్యూబ్ లో 2 కోట్ల వ్యూస్ తో ఈ ప్రచార గీతం సూపర్ హిట్ అయింది.
జగన్ ఎన్నికల ప్రచార గీతం Ravali Jagan Kavali Jagan
రావాలి జగన్ కావాలి జగన్ పాటను పోలి ఉన్న శివ్ సేన ఎన్నికల ప్రచార గీతం ఇదిగో
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ పాటల ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం మొదలగు అనేక అంశాల్లో 'తెలంగాణ జానపదం' ముఖ్యభూమిక పోషించింది. సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై ఇప్పటికే వందల, వేల పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి.
గులాబీ జెండా సాంగ్
జనాల్లోకి ప్రభుత్వ పథకాలు చొచ్చుకెళ్లాలంటే పాట చాలా ప్రాముఖ్యమైందని గ్రహించిన కేసీఆర్, ఎన్నికల ముందు తాను ప్రవేశపెట్టిన పథకాలు జనాలకు విడమరిచి చెప్పేలా జానపద కళాకారుల ద్వారా పాటలకు ప్రాణం పోయిస్తూ వస్తున్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరించే పాట
తనకు పాట సాయం చేసే రసమయి బాలకిషన్ ను ఎమ్మెల్యేను చేసి ప్రాధాన్యతనిచ్చారు, దేశపతి శ్రీనివాస్ లాంటి వారిని అక్కున చేర్చుకున్నారు.
కేసీఆర్ పథకాలను వివరించే పాట మరో వెర్షన్
కాగా, ఇప్పుడు ఇదే ట్రెండ్ ను మహారాష్ట్రలోని రాజకీయ పక్షాలు ఫాలో అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పాటల సారాంశాన్ని ప్రధానంగా తీసుకొని వారూ ప్రచార గీతాలను రూపొందించి జనాల్లో వదులుతున్నారు. మరి ఈ తెలుగు ట్రెండ్ మహా ఎన్నికల్లో ఏ మేర ఫలిస్తుందో చూడాలి. అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.