PM Modi Independence Day Speech: ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరని వ్యాఖ్య

ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశభద్రత కోసం కరోనా మహమ్మారిపై డాక్టర్లు, పోలీసులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లు చేస్తున్న పోరాటం, దేశ సరిహద్దు వద్ద సైనికులు చూపిస్తున్న పోరాట పటిమ...

PM Narendra Modi addressing the nation on Independence Day (Photo Credits: ANI)

New Delhi, August 15: భారత 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశభద్రత కోసం కరోనా మహమ్మారిపై డాక్టర్లు, పోలీసులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లు చేస్తున్న పోరాటం, దేశ సరిహద్దు వద్ద సైనికులు చూపిస్తున్న పోరాట పటిమ, ఆత్మ నిర్భర్ భారత్ సాధన, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ, అయోధ్య రామమందిరం లాంటి ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పరిచేందుకు తీసుకవచ్చిన సంస్కరణలు ప్రధాని మోదీ వివరించారు.

ఆక్రమణ వాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన మోదీ, స్వాతంత్య్రోద్యమ స్పూర్థితో ఒక స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్ భారత్) దిశగా దేశం ముందుకు సాగుతోందంటూ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ దగ్గర్నించీ నుంచి ఇంకా ఎలాంటి సవాలునైనా సరే 130 కోట్ల భారతీయులు స్వదేశీ సూత్రాన్నే పాటించాలని మోదీ నొక్కి చెప్పారు. 'వోకల్ ఫర్ లోకల్' మన మంత్రం అవ్వాలని స్పష్టం చేశారు.

భారత సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరని పొరుగు దేశాలకు ప్రధాని దీటైన జవాబు ఇచ్చారు.  మోదీ మాట్లాడుతూ.. "ఈ రోజు పొరుగువారు అంటే మనతో సరిహద్దును పంచుకునే వారు మాత్రమే కాదు, మన హృదయంతో అనుసంధానం కాబడిన వారు. అలా మనకు అనుసంధానమైన వారితో సామరస్యత ఉంది. గత కొంత కాలంగా భారత దేశం, ఇతర దేశాలతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది అని చెప్పేందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని మోదీ అన్నారు.

"నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు దురాక్రమణవాదంతో మన దేశ సార్వభౌమాధికారం వైపు, ఎవరు కన్నెత్తి చూసినా మన సైనికులు అదే శైలిలో స్పందించారు, విస్తరణవాదులకు భారత్ వారి భాషలోనే సమాధానం చెప్పింది" అంటూ చైనా- పాక్ దేశాలనుద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.

ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, అధికారులు, మీడియా సిబ్బంది సహా 4 వేల మంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ప్రోటోకాల్‌లు అమలు చేశారు, సామాజిక దూరం మరియు ముసుగులు ధరించడం సహా ఇతర అన్ని సురక్షా విధానాలను అమలు పరిచారు.