PDP Poll Manifesto: కశ్మీర్ సమస్య కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు, ఏ కూటమిలోనూ చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన పీడీపీ
ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు. కూటమిగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ ఎజెండాలను అనుసరిస్తే తాము పోటీకి దూరంగా ఉంటామని మెహబూబా ముఫ్తీ అన్నారు.
Srinagar, AUG 24: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ (PDP Chief Mehbooba Mufti) అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను (JK Poll Manifesto) శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు. కూటమిగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ ఎజెండాలను అనుసరిస్తే తాము పోటీకి దూరంగా ఉంటామని మెహబూబా ముఫ్తీ అన్నారు. అప్పుడు 90 స్థానాల్లో వారే పోటీ చేయాలని చెప్పారు. అయితే ఎన్సీ (NC), కాంగ్రెస్ (Congress) మధ్య పొత్తు ఏ ఎజెండా ఆధారంగా కాదని, కేవలం సీట్ల పంపకం ప్రాతిపదికన జరిగిందని ఆమె విమర్శించారు. కాగా, పొత్తు, సీట్ల పంపకం చాలా దూరమైన విషయాలని మెహబూబా ముఫ్తీ అన్నారు.
‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మా ఎజెండాను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని మేం చెబుతాం. వారిని మేం అనుసరిస్తాం. ఎందుకంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఇంతకు ముందు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఒక ఎజెండా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్లు అంగీకరించిన ఎజెండా కూడా ఉంది’ అని ఆమె అన్నారు. అయితే కేవలం సీట్ల పంపకంపై మాత్రమే చర్చలు జరిగితే తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని ముఫ్తీ స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని హిందూ తీర్థయాత్ర స్థలమైన శారదా పీఠ్‌కు వెళ్లే మార్గాన్ని తెరువాలని తమ పార్టీ కోరుకుంటోందని మెహబూబా ముఫ్తీ తెలిపారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 నుంచి నిలిపివేసిన సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడం కోసం పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరుపాలని ఆమె అన్నారు.