COVID-19 Free India: భారత్‌లో లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కూడా కొనసాగుతుందా? అసలు ఈ పరిస్థితికి ముగింపు ఎప్పుడు? భారత్‌ను కోవిడ్-19 రహిత దేశంగా మార్చడంలో లాక్‌డౌన్ ప్రాముఖ్యతను తెలిపే విశ్లేషణాత్మక కథనం

ఏప్రిల్ 14 తర్వాత.....

Empty streets amid nationwide lockdown (Photo Credits: ANI)

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ భారత్ లోనూ విస్తరించడంతో  దీని వ్యాప్తిని (COVID-19 Outbreak in India) కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతనెల మార్చి 22న ఒకరోజు 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చారు. ఆ వెంటనే చాలా రాష్ట్రాలు మార్చి 31 వరకు కర్ఫ్యూను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ తదనంతర పరిణామాల నడుమ మళ్లీ ప్రధాని మోదీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మార్చి 24న 21 రోజుల దేశవ్యాప్త 'లాక్‌డౌన్' (Nationwide Lockdown) ను ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో దేశంలో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. నేడు దేశంలో ఏ రోడ్డు చూసినా, ఏ ప్రాంతం చూసినా నిర్మానుష్యంగా ఒక ఎడారిని తలపిస్తున్నాయి.

ఒక్కరోజు అనుకున్న కర్ఫ్యూ కాస్త వారానికి పెరిగింది, వారమే అనుకున్నది కాస్తా 3 వారాలకు పెరిగింది. దేశంలోని ప్రజలు ఎవరూ ఊహించని విధంగా ఎక్కడివారక్కడే బందీ అయిపోయారు. మునుపెన్నడూ చూడని పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయి. ప్రజలు ఒక కొత్త అనుభూతికి లోనవుతున్నారు, ప్రతి ఒక్కరిలో నేడు ఒకరకమైన భయాందోళన నెలకొని ఉంది. ఇంకోవైపు, దేశంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది.

మరి ఈ పరిస్థితులు దేశంలో ఇంకెంత కాలం కొనసాగుతాయి? దేశంలో కరోనావైరస్‌కు అంతం ఎప్పుడు? ఏప్రిల్ 14 తో లాక్‌డౌన్ ముగిసిపోతుందా? లేక మరింత కాలం పొడగిస్తారా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సగటు భారతీయుడిలో మెదులుతూ ఉన్నాయి. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడగించే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు నివేదికలు విడుదల చేశాయి. అయితే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆ వార్తలను ఖండించారు. 21 రోజులకు మించి లాక్డౌన్ పొడగించే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థలు విడుదల చేసిన నివేదికలన్నీ నిరాధారమైనవిగా ఆయన పేర్కొన్నారు.

అయినప్పటికీ 'మంటలేనిదే పొగరాదు' అనే సామెత ప్రకారం, ఎలాంటి ఆధారం లేకుండా మీడియా నివేదికలు బయటకు రావు కేబినేట్ కార్యదర్శి చెప్పినంత మాత్రానా లాక్ డౌన్ ఒక్కసారిగా ఎత్తివేస్తారనడంలో అర్థం లేదు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా దిల్లీ- నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన 'తబ్లీఘి జమాత్' సమావేశం వివిధ రాష్ట్రాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కొత్తగా అంతర్జాతీయ కేసులు ఏమి లేకపోయినా, స్థానికంగా కరోనా మహమ్మారి చాపకింద నీరులా ప్రబలుతోందా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న.   భారతదేశంలో 1,637కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదు

ప్రస్తుతం దేశంలో ఇలాంటి ఒక అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ IANS దేశంలో లాక్‌డౌన్ కొనసాగింపుపై ఒక గ్రాఫ్ ను రూపొందించింది. ఇందులో లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ను వివరించింది. రెండు రకాల ప్రణాళికలతో ముందుకొచ్చింది.

1) ఏకధాటిగా 49 రోజుల పాటు లాక్ డౌన్ ను కొనసాగించడం ద్వారా భారతదేశంలో COVID-19 కేసులు క్రమంగా తగ్గుతూ వస్తాయి. 2020 మే 13 నాటికి దేశంలో కొరోనావైరస్ అంతం అవుతుంది.

2) మూడు లాక్‌డౌన్లు ప్రకటించడం, ప్రతి లాక్‌డౌన్ కు మధ్య ఒక 5 రోజుల పాటు వ్యవధి ఇవ్వడం అనేది మరొక ఆలోచన. జూన్ 9 నాటికి ఈ పీరియడ్ ముగుస్తుంది.

రెండో ఆప్షన్‌ను వివరంగా చెప్పుకుంటే. ప్రస్తుతం అమలులో ఉన్న మొదటి లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. దీని తర్వాత 5 రోజుల పాటు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఏప్రిల్ 21న 28 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించడం. ఇది మే 17తో ముగుస్తుంది, ఆ తర్వాత మరో 5 రోజులు బ్రేక్ ఇచ్చి మరో 18 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడం. ఈ పీరియడ్ జూన్ 09తో ముగుస్తుంది.

స్థూలంగా చెప్పుకుంటే: 21 రోజుల లాక్‌డౌన్ + 5 రోజులు విరామం + 28 రోజుల లాక్‌డౌన్ + 5 రోజులు విరామం + 18 రోజుల లాక్‌డౌన్= సమాప్తం. ఈ రకంగా కొనసాగే అవకాశం ఉంటుంది.

Take a Look at the Possible Lockdown Patterns in India:

 

కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించాలంటే 'సామాజిక దూరం' పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ లాక్‌డౌన్ ఎంత పకడ్బందీగా అమలు జరిగితే, ప్రజలు అంత:కరణ శుద్ధితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తే, కరోనాలక్షణాలు కలవారు బాధ్యతగా వ్యవహరిస్తూ స్వచ్ఛంధంగా ప్రభుత్వానికి సహకరిస్తే స్థానికంగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. తద్వారా క్రమక్రమంగా దేశంలోనుంచి ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చు. అప్పుడే లాక్‌డౌన్ నుంచి వీలైనంత త్వరగా ప్రజలు సాధారణ జనజీవితంలోకి వచ్చే ఆస్కారం ఏర్పడుతుంది. జరగబోయే భారీ నష్టం నుంచి మన దేశాన్ని బయటపడేసినట్లవుతుంది. కాబట్టి ఈ లాక్‌డౌన్ కష్టాన్ని ప్రజలు ఇష్టంగా భరిస్తూ అదే సమయంలో కరోనావైరస్ అనుమానితుల గురించి ప్రభుత్వానికి సమాచారం అందించాలి. ఈ బాధ్యత భారతదేశంలో ప్రతి పౌరుడిపై ఉందని గుర్తించాలి.