Sathya Sai Baba Birthday: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గురువు, సేవకు ప్రతిరూపం, సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం
ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.
Puttaparthi, November 23: సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.
బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారు. సత్యసాయి బాబా వారి బోధనలు సర్వ మత సమైక్యతను ప్రభోధిస్తాయి.
సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.
సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబర్ 23న కార్తీక సోమవారం రోజు బాబా జన్మించారు. అనంతపురం జిల్లాలో నేటి పుట్టపర్తిగా పిలవబడుతున్న పట్టణంలో పెద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాలుగో సంతానం బాబా జన్మించారు.
సత్యసాయిబాబావారి బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య అంశాలనూ ప్రభోధిస్తుంటాయి.
ఉన్నది ఒకటే కులం - అది మానవకులం,
ఉన్నది ఒక్కటే మతం -అదే ప్రేమమతం,
ఉన్నది ఒక్కటే భాష -అదే హృదయం భాష,
ఉన్నది ఒకే దేవుడు - అతడు సర్వాంతర్యామి.
సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం. పేద విద్యార్ధులకు సహకరించడం,వైద్య సేవలు, అనేక విధాలైన దాన కార్యక్రమాలు నేటికీ నిరాటంకం గా నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 186 దేశాల్లో 10,000 పైగా సత్యసాయి సేవా సంస్థలున్నాయి.
వైద్య సేవలు
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ - 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు చే 1991 నవంబరు 22న ప్రారంభింపబడింది. అలాగే బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్' 2001 జనవరి 19న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిచే ప్రారంభింపబడింది. ఇది 333 పడకలు గల ఆసుపత్రి. ఈ వైద్యాలయాలన్నీ పేద, ధనిక అనే భేదం లేక కేవలం వ్యాధిగ్రస్తులనే ఒకే ఒక భావనతో అందరికీ ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నాయి. చాలా ఖరీదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సల వంటివి పూర్తిగా ఉచితం. అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యసేవలను అందిస్తూనే ఉంది.
త్రాగు నీటి సేవలు
సత్యసాయి బాబా వారు ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టులు ,అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక గ్రామాలకు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200 కోట్ల రూపాయలపైన ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు త్రాగునీటి సరఫరా చేస్తున్నది.ఇంకా మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడి మంచి నీరు అందించే సేవలో ఉన్నాయి.
బాబా మానవాళికి అందించిన సేవలు
* 1945లో ప్రశాంత నిలయం నిర్మాణం. 1950లో ప్రారంభం.
* 1954లో పుట్టపర్తిలో చిన్న ఆస్పత్రి నిర్మాణంతో సత్యసాయి సేవలు ప్రారంభమయ్యాయి.
* 1970లో వైట్ ఫీల్డులో మహిళలు, పిల్లలకు సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు.
* 1981లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్(సత్యసాయి విశ్వవిద్యాలయం).
* రాయలసీమ ప్రజల తాగునీటి అవసరాలకు 1995 మార్చిలో మంచినీటి ప్రాజెక్టును తలపెట్టారు. ఈ పథకం ద్వారా రాయలసీమలోని 750 గ్రామాలకు తాగునీరు అందించారు.
* 2004 నుంచీ చెన్నై ప్రజల దాహార్తినీ సత్యసాయిట్రస్టు తీరుస్తోంది. సత్యసాయి గంగా కెనాల్ పథకంపై బాబాను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కొనియాడారు.
* మెదక్ జిల్లాలోని 179 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* మహబూబ్‌నగర్ జిల్లాలోని 141 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* ఉచిత వైద్యం కోసం 2001లో బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సత్యసాయి ప్రారంభించారు.
* 2009లో ఒడిశా వరద బాధితులకు సత్యసాయి ట్రస్టు 699 ఇళ్లను నిర్మించి ఇచ్చింది.
* ఆస్ట్రేలియా, మెక్సికో, బ్రిటన్ సహా 33 దేశాల్లో ఉచిత విద్యాసేవలు అందిస్తున్నారు.
* 166 దేశాల్లో ఉచిత విద్య, వైద్య, ఇతర సేవలను సత్యసాయి ట్రస్టు అందిస్తోంది.
* మొబైల్ డిస్పెన్సరీలతో దేశంలోని మురికివాడల్లో సత్యసాయి ట్రస్టు వైద్యసేవలు అందిస్తోంది.