Types of Hugs: ప్రియమైన వారిని గట్టిగా హత్తుకుంటే ప్రయోజనాలు ఎన్నో, నిచ్చెలి ఇచ్చే వెచ్చని కౌగిలి ప్రేమలోని గాఢతను తెలియజేస్తుంది, ఒక్కో రకమైన కౌగిలికి ఒక్కోరకమైన అర్థం, అవేంటో తెలుసుకోండి మరి!

Different Types of Hugs (Photo Credits: Pexels, PickPic and NeedPix)

Happy Hug Day 2024: ఒక చిన్న కౌగిలి దూరాలను దగ్గర చేస్తుంది, ఆత్మీయ ఆలింగనం మనసు పొరల్లోని ధ్వేషాన్ని తొలగించి ప్రేమను చిగిరింపజేస్తుంది. బాధల నుంచి ఓదార్పును అందిస్తుంది. కౌగిలింత ఎంతో శక్తివంతమైనది, అందుకే ప్రేమికుల వారంలో ఒకరోజును కౌగిలింతకు ప్రత్యేకంగా కేటాయించారు. ప్రియమైనవారి మధ్య హృదయపూర్వకమైన కౌగిలి ప్రేమలో గాఢతను పెంచుతుంది. నిచ్చెలి ఇచ్చే వెచ్చని మెత్తని కౌగిలి రెండు మనసులను గట్టిగా ఏకం చేస్తుంది, ఇద్దరి మధ్య అప్యాయత, అనురాగాలను పెంచుతుంది. కౌగిలి అనేది ఏ బంధంలో అయినా సాన్నిహిత్యాన్ని పెంచే ఒక వ్యక్తీకరణ, ప్రేమను తెలిపే లోతైన భావన. భాగస్వామిని భావోద్వేగంతో ముడివేసే ఒక సాధనం.

అయితే, ఈ కౌగిలింతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, వాటికి వేర్వేరు అర్థాలు ఉంటాయని మీకు తెలుసా? 2024లోని ప్రేమికుల వారంలో ఫిబ్రవరి 12న 'హగ్ డే' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వివిధ రకాల కౌగిలింతల గురించి ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాం.

1. టైట్ స్క్వీజ్:

ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటే దానిని టైట్ స్క్వీజ్ హగ్ అంటారు. ఇది ఒక గాఢమైన, దీర్ఘమైన కౌగిలింత. ఇది ఇద్దరి మధ్య లోతైన భావోద్వేగ కనెక్షన్ ను, భద్రతా భావాన్ని సూచిస్తుంది. ఈ రకమైన కౌగిలింత సన్నిహితంగా ఉండాలనే కోరికను తెలియజేస్తుంది, భాగస్వాముల మధ్య లోతైన బంధాన్ని ప్రదర్శిస్తుంది.

2. బేర్ హగ్:

ఇది పెద్దగా చేతులు చాచి భాగస్వామిని చుట్టుముట్టే కౌగిలింత. ఈ ఉత్సాహభరితమైన కౌగిలింత భాగస్వామితో ఉన్నప్పుడు ఆనందం, ఉల్లాసాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన వారిని చాలాకాలంగా విడిపోయి, లేదా దూరమయినపుడు మళ్లీ కలిసిన సందర్భంలో, అసంకల్పితంగా ఇలాంటి హగ్ చేసుకుంటారు, సంతోషంలో మునిగి తేలుతారు.

3. ది జెంటిల్ పాట్ హగ్:

ఇది ఒక పక్క నుంచి వీపు లేదా భుజాలపై చేయి వేసి దగ్గరకు తీసుకునే కౌగిలింత. ఈ రకమైన కౌగిలింత తరచుగా కష్ట సమయాల్లో సానుభూతిని పంచడానికి, నీకు నేను ఉన్నాను అనే భరోసాను కలిగించే కౌగిలింత. ఇద్దరి మధ్య మంచి స్నేహం, అవగాహనను కలిగించడానికి ఈ రకమైన హగ్ ఇస్తారు.

4. వెయిస్ట్ హగ్

ఇది భాగస్వామికి వెనక నుంచి ఇచ్చే కౌగిలింత. భాగస్వామిని వెనక నుంచి గట్టిగా హత్తుకొని, చేతులతో నడుమును చుటేసి బంధించేటువంటి కౌగిలింత. ఈ రకమైన కౌగిలింత తరచుగా శృంగార కోరికను తెలియజేస్తుంది, ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది.

5. వన్-ఆర్మ్ హగ్:

ఇది ఒక చేతితో దగ్గరకు తీసుకొని అలుముకునే కౌగిలింత. సాధారణంగా వెనకనుంచి మెడ- ఛాతి భాగం మధ్యలో చేయి పెనవేసి దగ్గరకు తీసుకునే కౌగిలింత. ఇది దగ్గరి స్నేహాన్ని, ఇష్టం అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. అవతలి వ్యక్తిని ముంచెత్తకుండా సూక్ష్మంగా కనెక్ట్ కావాలనే కోరికను తెలియజేస్తుంది.

హగ్ డే అనేది జంటల మధ్య స్పర్శ ఉండాలని, ఒక స్పర్శతో ప్రేమలోని గాఢతను, భావోద్వేగాలను తెలియజేయడానికి ఉద్దేశించినది. కాబట్టి మీ ప్రియమైన వారిని మీ కౌగిలిలో బంధించి, మీ బంధాన్ని మరింత దృఢంగా చేసుకోండి.