Mahashivaratri 2021: 'ఓం నమ: శివాయ' స్మరణలతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు, చీకటి అనే అజ్ఞానాన్ని అధిగమించటమే శివరాత్రికి అర్థం, మహా శివరాత్రి పర్వదిన విశేషాలు తెలుసుకోండి
అందుచేత శివనామస్మరణం సకలజనులని పరిశుద్ధం చేస్తుందని పురాణాలు చెబుతాయి.....
మహా శివరాత్రి హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినం. చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు మహా శివరాత్రి వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఈ మహారాత్రి శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది కాబట్టి ఈరోజు అన్ని శైవక్షేత్రాలతో శివపార్వతుల వివాహమహోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు.
ఈరోజు పరమ శివుడుని భక్తితో కొలుస్తూ , అభిషేకాలు చేస్తూ జరుపుకుంటారు. శివరాత్రి శివుడికి ఎంతో ఇష్టమైన రోజుగా చెప్తారు. 'ధ్యానంతో జాగరూకత కలిగి జీవితంలో చీకటి అనే అజ్ఞానాన్ని అధిగమించడం' అనే అర్థాన్ని శివరాత్రి సూచిస్తుంది. అందుకే ఈరోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం ఉండి శివ నామస్మరణలు, ధ్యానం, భజనలు చేయడం ద్వారా భోలా శంకరుడైన ఆ శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈరోజు శివుడికి ప్రధానంగా బిల్వ ఆకులను సమర్పిస్తారు. భక్తులు ఈరోజు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, పూజలు చేసి, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి అంతా జాగరణ చేసి, ఆ మరునాడు భోజనం చేస్తారు . ఈ రాత్రంతా అన్ని శివాలయాల్లో శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. "ఓం నమః శివాయ" స్మరణలతో ఈరోజు అన్ని శైవ క్షేత్రాలు మారుమోగుతాయి.
శివుడు అనగా కల్మషము లేని వాడు, అంటే ప్రకృతి యొక్క (తమో, రజో, సత్వ) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం సకలజనులని పరిశుద్ధం చేస్తుందని పురాణాలు చెబుతాయి. నిజాయితీ, దాతృత్వం, క్షమాగుణం కలిగి ఉండటం, నీతి మరియు ధర్మాలను పాటించడం లాంటివి శివతత్వాలు. ధ్యానం ద్వారా వీటి ఆచరణ సాధ్యమవుతోంది.