Khairatabad Ganesh: తొలి పూజ అందుకున్న 63 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి, శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమిచ్చిన మహా గణేశుడు
సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి నేతలు హారతిచ్చారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ ఏడాది 63 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ వెల్లడించింది.ఖైరతాబాద్ లో గణేశుడు ఈసారి శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈరోజు మహాగణపతి నిర్వహించిన తొలిపూజకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని తలెత్తకుండా అన్ని విభాగాలను సమన్వయము చేశామన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. నిమజ్జనం వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
గవర్నర్ తమిళి సై మహా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అంతా సుఖశాంతులతో, ఆరోగ్యాంగా ఉండాలని ఖైరతాబాద్ గణేషుడిని కోరుతున్నానన్నారు.