
Kolkata, Feb 27: కలకత్తాలోని గంగా నది ఘాట్ వద్ద డెడ్ బాడీతో ఉన్న సూట్‌కేస్ కనిపించడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున కోల్‌కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు క్యాబ్‌లో చేరుకున్నారు. వెంట తెచ్చిన ట్రాలీ బ్యాగ్‌ను నది వద్దకు భారంగా ఈడ్చుకువచ్చారు. ఆ సమయంలో ఘాట్ వద్ద యోగా చేస్తున్న కొందరు వ్యక్తులు అనుమానంతో మహిళలను నిలదీసారు. ట్రాలీ సూట్‌కేస్‌లో ఏం ఉందని ప్రశ్నిస్తే చనిపోయిన తమ పెంపుడు కుక్క మృతదేహం ఉందని మహిళలు సమాధానం చెప్పారు.
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాలీ సూట్‌కేస్‌ను తెరిచి చూశారు. రక్తంతో తడిసిన దుస్తుల్లో చుట్టిన మహిళ మృతదేహం కుక్కి ఉండటం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యగ్రామ్ నివాసితులైన ఫల్గుణి ఘోష్, ఆమె తల్లి ఆరతి ఘోష్‌గా వారిని గుర్తించారు. సూట్‌కేస్‌లోని మృతురాలు వారి బంధువైన సుమితా ఘోష్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్యహత్యకు పాల్పడిందని, భయంతో మృతదేహాన్ని నదిలో పడేసేందుకు ప్రయత్నించినట్లు ఆ మహిళలు చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.