New York, Feb 05: అమెరికా (USA) లో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారి స్వంత దేశాలకు వెళ్లగొడుతోంది.తాజాగా చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయులను (Indian Migrants) వారి ప్రత్యేక విమానంలో స్వదేశానికి (US Illegal Indian Immigrants Return) పంపింది.104 మందితో టెక్సాస్ నుంచి బయల్దేరిన అమెరికా (USA) సైనిక విమానం సీ-17.. బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది.
వీరిలో 30 మంది పంజాబ్, 33 మంది హరియాణా, 33 మంది గుజరాత్ వాసులతో పాటు మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు చండీగఢ్ వాసులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలుత, విమానంలో 205 మంది స్వదేశానికి వస్తున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 104 అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వలసదారుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం భారత్‌కు రావడం ఇదే తొలిసారి. కాగా విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి ఎయిర్‌పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వెనక్కి పంపేముందు ప్రతిఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు.
US Illegal Indian Immigrants Return:
#WATCH | US Air Force plane carrying Indian citizens who allegedly illegally migrated to USA lands in Punjab's Amritsar. pic.twitter.com/JmT1xApZKO
— ANI (@ANI) February 5, 2025
అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20,407 మంది భారతీయుల (Indian Migrants) వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు.. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్‌వో) నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు
అక్రమవలసదారులపై ట్రంప్ (Donald Trump) మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు పలువురిని తరలించింది.
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
రాబోయే రోజుల్లో కూడా భారతీయ వలసదారులను తీసుకుని మరిన్ని విమానాలు అమెరికా నుంచి ఇండియాకు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.