
Hyderabad, Feb 25: యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని ఓ యువత్రయం మరోసారి నిరూపించారు . తెలుగు రాష్ట్రాలకు చెంది అమెరికాలో స్థిరపడిన కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత (AI Powered) పునర్వినియోగ స్మార్ట్ నోట్ బుక్ ను (World's First AI Powered Reusable Smart Notebook) అభివృద్ధి చేశారు. హైదరాబాద్ కు చెందిన క్వాడ్రిక్ ఐటీ (Quadric IT) సంస్థ ద్వారా ఈ ఆవిష్కరణను తెరమీదకు తీసుకొచ్చారు. కృత్రిమ మేథస్సుతో (ఏఐ) పనిచేసే ఈ స్మార్ట్ రీ యూజబుల్ నోట్ బుక్ ఈ సంవత్సరపు బయో ఆసియా-2025 కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
ఎన్నెన్నో విశేషాలు..
ఏఐను ఉపయోగించి ఆప్టికల్ క్యారెక్టర్ రెకగ్నిషన్ ద్వారా డాక్యుమెంట్ స్కానింగ్, చేతిరాతలో ఉన్న టెక్స్ట్ ని ఎడిటింగ్ కు, సెర్చింగ్ కు వీలయ్యే డిజిటల్ టెక్స్ట్ గా మార్చడం, పలు భాషల్లోకి అనువాదం, సంక్షిప్తీకరణ, విశ్లేషణ, కీ వర్డ్ లను గుర్తించడం లాంటివి ఈ నోట్ బుక్ ద్వారా సుసాధ్యం చేసుకోవచ్చు. చేయవలసిన పనులు, మీటింగ్ నోట్స్, ఎంక్వయిరీ ఫారమ్స్, న్యాయ పరమైన డాక్యూమెంట్స్ లాంటి వాటి కోసం రెడీగా స్మార్ట్ టెంప్లేట్స్ ఇందులో ఉన్నాయి. చేతి రాతను గుర్తించడమే కాకుండా దానిలో అంశాలను క్రమ పధ్ధతిలో పేర్చి డిజిటల్ ఫార్మాట్లో ఈ స్మార్ట్ నోట్ బుక్ అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆధునిక డాక్యుమెంట్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ సాయంతో తనంతట తానే డాక్యుమెంట్ అంచులను గుర్తించి చక్కగా స్కాన్ చేసుకోవడమే కాకుండా కృత్రిమ మేథస్సు తోడైన కలర్ ఫిల్టర్ల సాయంతో టెక్స్ట్ లో స్పష్టతను పెంచి చదవడానికి సులువుగా చేస్తుంది ఈ నోట్ బుక్.
పర్యావరణ పరిరక్షణకు..
ఈ స్మార్ట్ రీ యూజబుల్ నోట్ బుక్ పేపర్ అవసరాన్ని తగ్గించి పర్యావరణానికి దోహదం చేస్తుంది. నీళ్లలో తడిచినా పాడవ్వకుండా దీనికి వాటర్ ప్రూఫింగ్ చేశారు. మామూలు నోట్ బుక్ లా కాకుండా వంద సార్లు దీన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అని నోట్ బుక్ సృష్టికర్తలు తెలిపారు.
ఇప్పటికే ఎన్నో గుర్తింపులు
ఈ నోట్ బుక్ ను గూగుల్ కంపెనీ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత్ లో మొదటి 100 భవిష్య మొబైల్ అప్లికేషన్స్ లో ఒకటిగా గుర్తించాయి. దీని రూపకల్పన ఏఐసీ, టీ హబ్ లో జరిగింది. నార్త్ స్టార్ దుబాయ్ 2024 కాన్ఫరెన్స్ లోని ఇండియా పెవిలియన్ లో, దుబాయ్ పేపర్ వరల్డ్ ఎక్స్ పో లో దీన్ని ప్రదర్శించారు. పునర్వినియోగానికి వీలయ్యే ఓఎమ్మార్ షీట్లను కూడా తాము తయారు చేస్తున్నట్లు, ఇవి కాలేజీ లకు, పోటీ పరీక్షలకు ఖర్చయ్యే లక్షలాది పేపర్లను ఆదా చేస్తుందని నోట్ బుక్ ఆవిష్కర్తల్లో ఒకరైన సాయి కృష్ణ తెలిపారు.