Fenugreek Health Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మెంతినీరు తాగండి, దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి!

fenugreek health benefits| Freepik

Fenugreek Water On Empty Stomach- Health Benefits: అనేక అనారోగ్య సమస్యలకు భారతీయుల వంట గదుల్లోనే పరిష్కారాలు లభిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసుల్లో మెంతులు కూడా మనం తరచుగా ఉపయోగిస్తుంటాం. మెంతులు ఆహారానికి మంచి రుచి, సువాసనను అందించడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

మెంతులు సోడియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి వంటి అనేక రకాల పోషకాలకు మూలం. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగడం ద్వారా అధిక బరువు తగ్గించుకోవచ్చు. ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మెంతి నీటిని సరైన విధానంలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

రాత్రంతా ఒకగ్లాసు నీటిలో కొన్ని మెంతులను నానబెట్టి తర్వాత ఉదయం ఖాళీకడుపుతో ఆ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నీరు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. మెంతి నీటిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

చర్మానికి మేలు చేస్తుంది

మెంతి నీరు చర్మానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చర్మానికి మంచి పోషణను అందించడంతో పాటు స్కిన్ అలర్జీలను తగ్గిస్తుంది. తద్వారా చర్మంపై మొటిమలు, మచ్చలు సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

జలుబు దగ్గు నుండి ఉపశమనం

మెంతి గింజలలో మసిలేజ్ అనే మూలకం కనిపిస్తుంది. ఇది జలుబు , దగ్గు నుండి ఉపశమన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఒక చెంచా మెంతి గింజలను ఒక కప్పు నీటిలో మరిగించి, నీరు సగానికి తగ్గినప్పుడు దానిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా త్రాగాలి.

బరువు తగ్గడం కోసం

మెంతికూరలో మంచి పీచుపదార్థం ఉండటం వల్ల ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మలాన్ని మృదువుగా మార్చి మలబద్దకం సమస్యను నివారిస్తుంది. క్రమంతప్పకుండా మెంతినీరు తాగటం వలన అధిక బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

మెంతి నీరు తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు గొప్ప మేలు చేస్తాయి.

మెంతి నీరు ఎలా తయారు చేయాలి?

మెంతి నీటిని తయారు చేయడానికి, ముందుగా 1 టీస్పూన్ మెంతులను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఆ తరువాత, ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నీటిని వడకట్టి, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తాగండి. ఇలా క్రమం తప్పకుండా తాగటం వలన మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, మీకు ఫుడ్ ఎలర్జీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మెంతి నీరు తాగటానికి ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.