World Blood Donor Day: దానం చేసిన రక్తం ఎవరి ప్రాణాన్ని నిలిపిందో దాతలకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో తెలియజేస్తారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంను (World Blood Donor Day) జరుపుకుంటారు.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

కాలంతో పాటు ప్రపంచం ఎంత 'స్మార్ట్' గా దూసుకుపోతున్నా, రక్తదానంలో  (Blood Donation) మాత్రం నానాటికి వెనకబడిపోతుంది.

రోజురోజుకూ రక్తం నిల్వలు దారుణంగా పడిపోతుండటంతో ఎంతో మంది సమయానికి వారికి కావాల్సిన రక్తం అందక చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాగే కొనసాగుతుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)  ఆందోళన వ్యక్తం చేస్తుంది.

అయితే, ఈ పరిస్థితిని అధిగమిస్తూ స్వీడన్ (Sweden) దేశం ఒక ముందడుగు వేసింది. స్వీడన్ దేశంలో ఎవరైనా రక్తదానం చేస్తే దాతల వివరాలు నమోదు చేసుకొని తర్వాత వారి రక్తం ఎప్పుడు, ఎక్కడ ఎవరి ప్రాణాలను నిలిపిందో ఆ రక్త గ్రహీతల వివరాలను దాతలకు టెక్స్ట్ మెసేజ్ (Text Message)  రూపంలో వారికి తెలియజేస్తారు. రక్తదాతలను ఉత్సాహపరుస్తూ మరింత మందిని రక్త దానం చేసేలా ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంను (World Blood Donor Day) జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలుపుతూ, సురక్షితమైన రక్తదానం యొక్క ఆవశ్యకత మరియు రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005 లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది.

A, B, O బ్లడ్ గ్రూపులను కనుగొన్న కార్ల్‌ లాండ్‌స్టీనర్ (Karl Landsteiner) జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ఈ ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా స్వీడన్ దేశ తరహాలో రక్తదాతలను ప్రోత్సహించేలా మరిన్ని ఆదర్శవంతమైన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలు చేపట్టాలని కోరుకుందాం. రక్త దానం చేయండి, ప్రాణదాతలు కండి.!