Zika Virus: దేశంలో ఇంకో కొత్త వైరస్, కేరళని వణికిస్తున్న జికా వైరస్, రెండు రోజుల్లోనే 14 కేసులు వెలుగులోకి, జికా వైరస్ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే కొత్త కొత్త వైరస్ లో (New Virus) మళ్లీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా పలు రకాల జన్యువులతో హడలెత్తిస్తున్న నేపథ్యంలో తాజాగా జికా వైరస్ (Zika Virus) అలజడి రేపుతోంది. కేరళను జికా వైరస్ వణికిస్తోంది.
Thiruvananthapuram, July 10: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే కొత్త కొత్త వైరస్ లో (New Virus) మళ్లీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా పలు రకాల జన్యువులతో హడలెత్తిస్తున్న నేపథ్యంలో తాజాగా జికా వైరస్ (Zika Virus) అలజడి రేపుతోంది. కేరళను జికా వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 14కు (Zika Virus Cases in Kerala Rise to 14) చేరింది. దీంతో పాటు పుణెలోని జాతీయ వైరాలజీ కేంద్రానికి పంపిన నమూనాల్లో మరో ఐదింటి ఫలితం రావాల్సి ఉంది.
జికా పరిస్థితి తీవ్రత నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. వైరస్ కట్టడికి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ముఖ్యంగా గర్భిణులెవరైనా జ్వరంతో బాధపడుతుంటే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు ఆరోగ్య నిపుణులతో కూడిన బృందాన్ని (Central Team of Experts Sent to The Southern State) కేరళ పంపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు (Monitor Situation) వెల్లడించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది.
కేరళ పట్టణం పరస్సలకు చెందిన గర్భిణి (24) జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు రావడంతో గత నెల 28న తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేరింది. ఈ లక్షణాలు జికాకు సంబంధించినవే అని అనుమానం రావడంతో నిర్ధారణ కోసం నమూనాలను జాతీయ వైరాలజీ కేంద్రానికి పంపారు. ఈ మహిళకు బుధవారం సాధారణ ప్రసవమైంది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ గర్భిణికి ప్రయాణ చరిత్ర ఏదీ లేదు. అయినా జికా వైరస్ రావడంతో కలవరపాటుకు గురి చేస్తోంది.
అయితే జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ జికా ఏంటి? దీని లక్షణాలు, ప్రమాదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జికా వైరస్ వేటిపై ప్రభావం చూపుతుంది.
కేరళలో కొత్తగా వెలుగులోకి వచ్చిన జికా వైరస్ లక్షణాలు (Zika Virus Symptoms) మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది.
ఈ వైరస్ తొలుత ఎక్కడ కనుగొన్నారు
1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఈ వ్యాధి దోమల ద్వా రా వ్యాపిస్తుందని నిపుణులు గుర్తించారు. ఆ అడవిలో వైరస్ పుట్టింది కాబట్టి ఆ పేరుతోనే జికా వైరస్ అని దీనికి నామకరణం చేశారు. 1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకింది. అనంతరం 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. తర్వాత వైరస్ మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వచ్చాయి. 2015–16లో జికా మహమ్మారి గా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని కొన్ని దేశాలు దీని ధాటికి విలవిలలాడాయి.
ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
1. డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు కూడా పగలు మాత్రమే కుడతాయి.
2. అలాగే లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు.
3. ఈ వైరస్ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి.
4. వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
5. జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
గర్భస్థ శిశువులకు ప్రమాదం
గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భం లోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)