Delhi Lockdown: ఇంగ్లీష్ మందులు ఎందుకమ్మా..ఒక్క పెగ్ వేస్తే అన్నీ మాయం, ఇంజెక్షన్‌లతో ఉపయోగం ఉండదని, ఆల్కహాల్ మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆల్కహాల్ సర్వరోగ నివారిణి.. 35 ఏళ్ల నుంచి తాగుతున్నా.. ఈ ఇంగ్లీష్ మందులతో ఏం కాదమ్మా... ఒక్క పెగ్‌తో అన్నీ మాయం’’ (Dawaion se asar nahi hoga, peg se asar hoga) అన్న ఆమెను చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు.
New Delhi, April 19: దేశరాజధాని ఢిల్లీలో ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నేటి రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైన్ షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. లిక్కర్ బాటిల్స్ పెద్ద ఎత్తున కొనుక్కుంటున్నారు. ఈ సందర్భంగా శివపురి గీతా కాలనీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ్గరకు మద్యం కోసం వచ్చిన వృద్ధురాలిని మీడియా ప్రతినిధులు పలకరించారు. ఆరు రోజులు లాక్‌డౌన్ అనగానే కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు కదా.. వారం రోజులు మద్యం లేకుండా ఉండలేరా అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సదరు వృద్ధురాలు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
మెడికల్ షాపులలో దొరికే మందుల కంటే తమకు వైన్స్‌లలో దొరికే మందులే బాగా పనిచేస్తాయన్నారు. తమకు ఇంజెక్షన్‌లతో ఉపయోగం ఉండదని, ఆల్కహాల్ మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే తమకు వైద్యులు ఇచ్చే మందుల కంటే వైన్స్‌లో ఇచ్చే పెగ్గులే బాగా పని చేస్తాయని చెప్పారు.
తాను గత 35 ఏళ్లుగా మద్యం సేవిస్తున్నానని, దానివల్ల ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. ఆమె చెప్పిన మాటలు విని అక్కడున్న వారు షాక్ అయ్యారు. ‘‘ఇంజక్షన్‌తో ఉపయోగం లేదు.. ఆల్కహాల్ సర్వరోగ నివారిణి.. 35 ఏళ్ల నుంచి తాగుతున్నా.. ఈ ఇంగ్లీష్ మందులతో ఏం కాదమ్మా... ఒక్క పెగ్‌తో అన్నీ మాయం’’ (Dawaion se asar nahi hoga, peg se asar hoga) అన్న ఆమెను చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు.
Here's Delhi Woman Video
ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటన చేసిన సందర్భంలో సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 23,500 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం చెప్పారు. పాజిటివిటీ రేటు, వైరస్ వ్యాప్తి పెరిగిందని కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు 25,000 కరోనా కేసులు నమోదయితే.. అందుకు తగినన్ని బెడ్లు లేవని, బెడ్స్ కొరత ఉందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్ సేవలు, ఫుడ్ సర్వీసెస్ కొనసాగుతాయని.. లాక్‌డౌన్ నుంచి ఈ సేవలకు మినహాయింపు ఉందని కేజ్రీవాల్ తెలిపారు.
పెళ్లిళ్ల వంటి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువగా హాజరవకూడదని, పెళ్లి వేడుక చేసుకునేవారికి ప్రత్యేకంగా పాసులు మంజూరు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇక.. బెడ్స్ కొరతకు సంబంధించి కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఈ ఆరు రోజుల లాక్‌డౌన్ సమయంలో మరిన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆక్సిజన్, మెడిసిన్ తగినన్ని ఉండేలా చూసుకుంటామని సీఎం చెప్పారు. అందరూ లాక్‌డౌన్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సీఎం కోరారు.
ఢిల్లీలో ఉన్న వలస కార్మికులకు కూడా సీఎం ఓ అభ్యర్థన చేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. ఇది పరిమిత లాక్‌డౌన్ మాత్రమేనని, కేవలం ఆరు రోజులేనని సీఎం చెప్పారు. దయచేసి ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లవద్దని ఆయన కోరారు. ఈ లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి రాదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్న కేజ్రీవాల్, ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని వలస కార్మికులకు హామీ ఇచ్చారు.