New Delhi, April 18: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ (Delhi Lockdown) అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ (Lockdown in Delhi) అమలులో ఉంటుందన్నారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సీఎం ఢిల్లీలో నాలుగో వేవ్ కొనసాగుతోందని, పాజిటివ్ రేటు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలతో అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఐసీయూ బెడ్స్ నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని ఆయన తెలిపారు. దీనికి తోడు రోజులు 25వేలకు పైగా కేసులు రావడంతో చికిత్స అందించడం కష్టంగా మారిందన్నారు.
రానున్న ఆరు రోజుల్లో ఢిల్లీ హాస్పిటళ్లలో బెడ్స్ సంఖ్యను పెంచుతామన్నారు. తమకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ఆక్సిజన్, మందులు ఏర్పాటు చేసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. వలస కూలీలకు ఆయన ప్రత్యేకంగా అభ్యర్థన చేశారు. ఇది చాలా స్వల్ప లాక్‌డౌన్ అని, కేవలం ఆరు రోజులే ఉంటుందని, వలస కూలీలు ఎవరూ ఢిల్లీ విచిడి వెళ్లవద్దు అని, ప్రభుత్వం మీ సంక్షేమాన్ని చూసుకుంటుందని ఆయన అన్నారు.
ఈ మేరకు కఠిన ఆంక్షలు (From 10 PM on April 19 till 6 AM on April 26) అమల్లోకి రానున్నాయి. అయితే అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కేవలం 50మందితో వివాహాలతో వివాహాలు జరపవచ్చు, ఇందుకోసం విడిగా పాస్‌లు జారీ చేయబడతాయి. త్వరలో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. నిన్న ఒక్క రోజే ఢిల్లీ నగరంలో 25 వేల కేసులు నమోదు అయ్యాయి. నగరంలో ఆరోగ్య వ్యవస్థ చాలా వత్తిడికి లోను అయ్యిందని, వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు కఠిన చర్యలు తప్పవని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ పొడిగించరాదు అని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రాజధానిలో భయంకరమైన కోవిడ్-19 పరిస్థితి, లాక్‌డౌన్ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ సీఎ కేజ్రీవాల్ సోమవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశం అనంతరం లాక్ డౌన్ ప్రకటనను విడుదల చేశారు. అన్ని ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం పనిచేయనున్నారు. అయితే, అవసరమైన సేవలకు పరిమితుల నుండి మినహాయింపు ఉండనుంది.
కాగా గతవారం ఏప్రిల్ 16 రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 19 ఉదయం 6 గంటల వరకు జాతీయ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూను ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మాల్స్, వ్యాయామశాలలు, ఆడిటోరియంలను మూసివేస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో 25,462 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 161 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 2,73,810గా ఉండగా, 1,619 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.