Jaipur, April 19: కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపధ్యంలో రాజస్థాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్‌డౌన్ వ్యవధిని (Lockdown in Rajasthan) పెంచింది. దీనికి సంబంధించిన నూతన గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలుచేస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోగల దుకాణాలను, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.
ఇదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్ 30 వరకూ కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఈ కర్ఫ్యూ కాలాన్ని మే 3 వరకూ ( Closure of Offices, Markets Till May 3) పెంచారు. రాష్ట్రంలో 10,000 కు పైగా తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా ఆదివారం ఒక్క రోజే 42 మంది మరణించారు. కొత్త కేసులలో దాదాపు 2 వేల మంది జైపూర్ నుండే ఉన్నారు. రాజస్థాన్‌లో ఇప్పుడు 67,387 క్రియాశీల కేసులు ఉన్నాయి.
దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,73,510 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,619 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 19.29 లక్షలు యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1.29 కోట్లు మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 1.50 కోట్లు దాటాయి. కరోనా వల్ల లక్షా 78 వేల మంది మృతి చెందినట్లు సోమవారం కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.